Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ!.. దమ్ముంటే రా అంటూ అంబటి కౌంటర్.. తొడగొట్టిన బియ్యం మధుసూదన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

High Voltage Tension in Ap assembly Minister Ambati Rambabu vs MLA Nandamuri Balakrishna ksm
Author
First Published Sep 21, 2023, 9:56 AM IST | Last Updated Sep 21, 2023, 10:10 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగాఅరెస్ట్ చేశారని ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా టీడీపీ సభ్యులతో పాటే నిరసనకు దిగారు. మరోవైపు అధికార పార్టీ సభ్యులు కూడా తీవ్రంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని అధికార వైసీపీ ఆరోపిస్తుంది. 

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళనలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ స్కిల్ స్కాంపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని మంత్రి బుగ్గన చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ చర్చపై బీఏసీలో నిర్ణయం  తీసుకుందామని అన్నారు. టీడీపీ ప్రతిసారి అర్థంపర్దం లేని వాయిదా తీర్మానాలు ఇచ్చి సభను అడ్డుకుంటుందని మండిపడ్డారు. ప్రభుత్వం వేసే ప్రశ్నలకు టీడీపీవాళ్ల దగ్గర సమాధానం ఉంటుందా? అని ప్రశ్నించారు. 

 ఈ క్రమంలోనే బాలకృష్ణకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. ‘‘ఒక నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు అతడు ఎంత దొంగైనా, దుర్మార్గుడైనా ఆ పార్టీ సభ్యులకు బాధ కలగడం సహజమైనదే. అయితే అందుకు ఇలా చేయడం సరైనది కాదు. వాయిదా తీర్మానం ఇస్తామని చెప్పారు.. వాయిదా తీర్మానంలో పూర్తిగా చర్చించవచ్చు. టీడీపీ సభ్యులు మీ(స్పీకర్) మీదకు దౌర్జన్యానికి వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలను అహ్వానిస్తున్నారు. 

మా పార్టీ నుంచి ఆ పార్టీలో చేరిన సభ్యుడు మీ ముందుకు వచ్చి.. మానిటర్‌ను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలను వారు ప్రోత్సహిస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. సభ నిబంధనలకు అనుగుణంగా ఉంటే  చర్చించడానికి అధికార పక్షం సిద్దంగా ఉంది. ఇటువంటి చర్యలతో అవాంఛనీయ సంఘటనలను ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారిపై మీరు చర్యలు తీసుకోవాలి. ఒకాయన బల్ల కొడుతున్నాడు. ఇక్కడ కాదు బల్లలు కొట్టాల్సింది.. కోర్టుల్లో బల్లలు కొట్టాలి. 

ఓవరాక్షన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. మా పార్టీ నుంచి కూడా వెల్లి ఓవరాక్షన్ చేసే వ్యక్తులు ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోకుంటే మా సభ్యులు కూడా కోపద్రిక్తులకు లోనయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలకు వారే బాధ్యత వహించాలి. బాలకృష్ణ మీసాలు తిప్పడం సినిమాల్లో చూపించుకోవాలి. నువ్వు రా దమ్ముంటే.. దమ్ముంటే రా..’’ అంటూ  సవాలు విసిరారు. ఇక, అంబటి రాంబాబు మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం తిప్పారని.. ఈ క్రమంలోనే అంబటి ఈ విధంగా స్పందించారని చెబుతున్నారు.

ఆ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాలకృష్ణను చూస్తూ తొడ గొట్టారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దృశ్యాలు అసెంబ్లీ లైవ్‌లో కనిపించడంతో అక్కడ ఏం చోటుచేసుకుందని కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని.. శాసనసభను వాయిదా వేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios