అమరావతి: ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు ప్రత్యేక హోదా అంశంపై సభ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో వైయస్ జగన్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు. 

గత ఎన్నికల ప్రచారంలో 23 లోక్ సభ స్థానాలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెప్పిన ఆనాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఇప్పుడు ఎందుకు హోదాపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పడు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు బీజేపీతో కుమ్మక్కు అయ్యారని మోదీతో కలిసిపోయారంటూ ఆరోపణలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వారు మోదీతో కలిసిపోయారా అంటూ నిలదీశారు. 

విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఆస్తులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఏపీకి తీవ్రనష్టం చేకూర్చిందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడం వల్లే చంద్రబాబు హైదరాబాద్ వదిలి అమరావతికి వచ్చేశారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. హైకోర్టు కొట్టేసిన కేసుల గురించి సభలో ప్రస్తావించడం సరికాదన్నారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. 

 మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు అసెంబ్లీలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కురుసాల కన్నబాబు. ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి గానీ చంద్రబాబు నాయుడు గానీ లేదన్నారు. హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నోసార్లు నాలుక మడతేశారంటూ సెటైర్లు వేశారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉల్లి ధరలపై టీడీపీ నిరసన

ప్రధాని నరేంద్రమోదీని ఒకసారి పొగుడుతారు మరోసారి ఎందుకు పనికిరాని వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తారంటూ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఇప్పుడు మోదీని మళ్లీ పొగడుతున్నారని చెప్పుకొచ్చారు. మోదీని వదలడం వల్ల నష్టపోయామంటూ ఇప్పుడు టీడీపీ నేతలు మాట్లాడటం చూస్తుంటే టీడీపీ యూటర్న్ లు గురించి తెలుస్తుందన్నారు. 

పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈరాష్ట్రంలో పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం టీడీపీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదంటూ సెటైర్లు వేశారు. 


పార్టీలేకాదు, బీ–ఫారాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారంటూ ధ్వజమెత్తారు కురసాల కన్నబాబు. 2014 నుంచి ప్రత్యేక హోదాకోసం పోరాటంచేసిన వ్యక్తి సీఎం వైయస్ జగన్‌ అని చెప్పుకొచ్చారు. 

ఢిల్లీలో, గుంటూరులో దీక్షలు, ధర్నాలు చేశారని చెప్పుకొచ్చారు. అలాగే హోదా ఆవశ్యకత తెలియజేసేందుకు యువతతో యువభేరీ వంటి కార్యక్రమాలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. హోదా కోసం పార్టీ ఎంపీలచేత రాజీనామాలు చేయించారని గుర్తు చేశారు.

వైసీపీ ఎంపీలు కన్నా, టీడీపీ ఎంపీలు అప్పట్లో ఎక్కువమంది ఉన్నా కానీ చీమకుట్టినట్లు కూడా వారికి లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక ప్యాకేజీయే బెటరని అప్పట్లో బల్లగుద్దినట్టు ఇదే చంద్రబాబు చెప్పలేదా అని నిలదీశారు. 

అసెంబ్లీకి వల్లభనేని వంశీ... టీడీపీ నేతల పక్కనే కూర్చొని

అప్పట్లో ఆర్థిక మంత్రికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచుకున్న చరిత్ర తెలియంది కాదన్నారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు నీతులు చెప్తుండటం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుకోసం ప్రత్యేక హోదా కావాలంటూ ప్రతిపక్షనేతగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా మడమ తిప్పకుండా మాట్లాడుతున్న వ్యక్తి  సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. 

ఆరోజు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా అవసరంలేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పలేదా అని నిలదీశారు. ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, జగన్ వైపే ప్రజలు ఉన్నారని తెలిసి రాత్రికి, రాత్రి యూటర్న్‌ తీసుకున్నారంటూ విరుచుకుపడ్డారు. 

మళ్లీ ప్రత్యేక హోదా ఛాంపియన్స్‌ అని మాట్లాడింది వీళ్లేనంటూ తిట్టిపోశారు. నవ్యాంధ్ర ప్రయోజనాలన్ని కేంద్ర ప్రభుత్వ వద్ద దెబ్బతీసి, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరిపెట్టుకుంటారన్న ఒక మైండ్‌సెట్‌ని క్రియేట్‌ చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. 

ఇకపోతే ప్రత్యేక హోదాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది ప్రతిపక్ష నాయుడుకు చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దదాంటాదా...ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల ఏమైనా లాభపడ్డాయా అని ప్రశ్నించింది చంద్రబాబు నాయుడు కాదా అని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి నిలదీశారు. 

ఏపీ అసెంబ్లీ‌లో చంద్రబాబు వ్యాఖ్యలపై గందరగోళం