ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓ వైపు టీడీపీ నేతలు ఉల్లి ధరల నియంత్రణ కోసం ఆందోళన చేపట్టారు. మరోవైపు సభలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య యుద్ధం జరుగుతోంది. కాగా... వీటన్నింటి కన్నా... ఇప్పుడు టీడీపీ బహిష్కృత నేత వల్లభనేని వంశీ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. నేటి అసెంబ్లీ  సమావేశాలకు వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు.

టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన వైసీపీకి దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో... ఈ రోజు వల్లభనేని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు అనగానే... అందరి దృష్టి ఆయనపై పడింది. 

అంతేకాదు... వంశీ..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే..వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. దీంతో..వంశీని టీడీపీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని పైన కొద్ది రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని సైతం స్పందించారు. టీడీపీ వంశీని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు సమాచారం ఇస్తే..ప్రత్యేకంగా స్వతంత్ర అభ్యర్ధి తరహాలో వంశీకి సీటు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

ఈ సంగతి పక్కన పెడితే.. నేటి సమావేశాలకు హాజరైన వల్లభనేని వంశీ.. డైరెక్ట్ గా వెళ్లి టీడీపీ నేతల పక్కన కూర్చోవడం గమనార్హం. వంశీ గతంలో లాగానే టీడీపీ బెంచ్ ల్లో వెనుక వైపు కూర్చున్నారు. టీడీపీ తమ పార్టీ నుంబి వంశీని సస్పెండ్ చేసినట్లు అధికారికంగా స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఆ తరువాత మాత్రమే అసెంబ్లీ కార్యదర్శి వంశీకి ప్రత్యేకంగా సీటు కేటాయిస్తారని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, టీడీపీ బెంచ్ ల నుండే వంశీ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.