కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 16నే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

అయితే రేపే ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఉదయం జరిగే కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత మధ్యాహ్నం ఆర్ధిక మంత్రి బుగ్గన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

Also Read;ఏపిలో కరోనా విజృంభణ... అసెంబ్లీలో అప్రమత్తం

శాసనమండలిలో డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసగించనున్నారు.

దేశంలోనే గవర్నర్ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించడం ఇదే తొలిసారి. బడ్జెట్‌కు ఆమోదం లభించిన తర్వాత మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లుల ఆమోదం తర్వాత శాసనసభ సమావేశాలను వాయిదా వేయనున్నట్లు సమాచారం.

Also Read:రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు

మరోవైపు రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం పక్కా నివారణ చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జాగ్రత్త చర్యలను సూచిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి ప్రత్యేక నోట్ పంపించగా.. లేజిస్లేచర్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు పలు కీలక సూచనలు చేశారు.