వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం విషయంలో హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది.

తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక సంస్తలు, గ్రామ కమిటీల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందని ఈ మేరకు హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.

Also Read:రాజధాని తరలింపు, 150 రోజులుగా ఆందోళన... చీమకుట్టినట్లు లేదు: జగన్‌పై బాబు విమర్శలు

రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. ఈ ప్రణాళిక ప్రకారం... రాజధానిలో ఇంతవరకు ఆర్-1 ( ప్రస్తుత గ్రామాలు), ఆర్-2 (తక్కువ సాంద్రత గృహాలు), ఆర్-3 (తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు) ఆర్-4 (హైడెన్సిటీ జోన్) పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి.

అయితే రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తూ ఏపీ సర్కార్ ఇటీవలే ప్రకటన విడుదల చేసింది.

Also Read:మద్యం అమ్మకాలపై పిటిషన్.... విచారణను మంగళవారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

ఇందులోని 900.97 ఎకరాలను ఆర్-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.