Asianet News TeluguAsianet News Telugu

జీతాల పెంపుకు జగన్ సర్కార్ ఓకే ... సమ్మె విరమించిన అంగన్వాడీలు 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల జీతాలను పెంచేందుకు అంగీకరించింది. అలాగే వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. 

Anganwadi workers call off strike in Andhra Pradesh AKP
Author
First Published Jan 23, 2024, 8:12 AM IST

విజయవాడ : ప్రభుత్వంలో చర్చలు సఫలం కావడంతో అంగన్వాడీలు ఆందోళన విరమించారు. వేతనాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి గత 42 రోజులుగా సమ్మెలో వున్నారు అంగన్వాడీ వర్కర్లు. విధులను బహిష్కరించి ఆందోళన బాటపట్టిన అంగన్వాడీల డిమాండ్లను జగన్ సర్కార్ అంగీకరించింది. దీంతో సమ్మెను విరమించిన అంగన్వాడీలు ఇవాళ్టి(మంగళవారం)నుండి విధులకు హాజరుకానున్నట్లు ప్రకటించారు. 

అంగన్వాడీలతో జరిపిన చర్చలగురించి ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అంగన్వాడీ ఉద్యోగుల జీతాలను జూలై నుండి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ వేతనాల పెంపుకు సంబంధించిన నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఇలా అంగన్వాడీల 13 డిమాండ్లలో ఇప్పటికే పదింటిని పరిష్కరించామని... మిగతావాటిపైనా సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు బొత్స వెల్లడించారు. 

 అంగన్వాడీ వర్కర్స్ ఉద్యోగ విరమణ ప్రయోజనాలను కూడా పెంచుతున్నట్లు విద్యామంత్రి తెలిపారు. అంగన్వాడీ వర్కర్లకు రిటైర్మెంట్ సమయంలో రూ.50 వేలు ఇస్తుండగా ఇకపై రూ.1,20,000 ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక హెల్పర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.60 వేలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. ఇక గ్రాట్యుటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటించనున్నట్లు తెలిపారు. అలాగే అంగన్వాడీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. 

Also Read  గుడ్ న్యూస్ : నేడు డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి నగదు.. ఎంత పడుతుందంటే..

ఇక ఈ సమ్మె కాలపు జీతాలను అంగన్వాడీలకు అందించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. సమ్మె, ఆందోళనల సమయంలో కొందరు అంగన్వాడీలపై కేసులు నమోదయ్యాయని... వాటిపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చర్చించి సానుకూల‌ నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అలాగే అంగన్వాడీల రోజువారీ కార్యక్రమాల్లో ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. 
 
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ కూడా సమ్మె విరమణపై ప్రకటన చేసారు.  ప్రభుత్వంతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని... తమ డిమాండ్లన్నింటికీ అంగీకరించిన నేపథ్యంలో సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులంతా ఇకపై విధులకు హాజరవుతారని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios