ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని... ఆయనే ఈ వైసిపి పాలనలో ఛిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడగలరని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ (tdp) అధికారంలోకి రావడం ఖాయమని ఏపి టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) ధీమా వ్యక్తం చేసారు. ఆరు నూరైన... ఎవ్వరు అడ్డొచ్చినా మళ్ళీ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని చంద్రబాబే కాపాడతారని అచ్చెన్న అన్నారు.
''సమర్ధవంతమైన నాయకులు వస్తే గాని రాష్ట్రంలో పరిస్థితి చక్కపడదు. ఒక అవకాశం అని చెప్పిన మాటలు నమ్మి ఈ వైసిపి (YCP) దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నందుకే ఈ దుస్థితి వచ్చిందని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి'' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
read more ఏపీకి ఇండస్ట్రీ రావాలి : టాలీవుడ్‌పై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ హాట్ కామెంట్స్
''విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత చంద్రబాబుది. 2014 సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో 22.5 ట్రిలియన్ యూనిట్లు విద్యుత్ లోటు ఉండేది. దీంతో టిడిపి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.36వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 10 వేల మెగావాట్లు విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చారు'' అని వివరించారు.
''విభజన హామీ ప్రకారం విద్యుత్ పరంగా రూ.6500 కోట్లు తెలంగాణ నుంచి ఏపీకి రావాలి. కానీ వాటిని రాబట్టడం ఈ వైసిపి ప్రభుత్వం వల్ల కావడం లేదు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ (ys jagan) పరిపాలన చేతగాని వ్యక్తి. రాయలసీమ థర్మల్ ప్లాంట్ మూసివేయడానికి ఈ ప్రభుత్వం సిద్దమయ్యింది'' అని అచ్చెన్న ఆరోపించారు.
''చంద్రబాబు హయాంలో ఇంటికి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇచ్చాం. అయినా ఏమాత్రం విద్యుత్ అంతరాయం లేకుండా చూసాం. కానీ టిడిపి హయాంలో కంటే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఇదే కొనసాగితే విద్యుత్ కష్టాలు తప్పవు'' అని హెచ్చరించారు.
''కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసిన ఘనత టిడిపిది. వారికి ఎన్నో చేసాం...ఏం అడిగినా ఇచ్చాం... కాబట్టి మాతోనే ఉంటారని అనుకున్నాం. కానీ పాదయాత్రలో జగన్ పెట్టిన దండాలకు కార్మికులు మోసపోయారు'' అని అచ్చెన్న అన్నారు.
''ఉద్యోగులకు డిఏ ఇచ్చాం... హెచ్ఆర్ఏ ఇచ్చాం. కానీ వైసిపి అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు అని ఇంతవరకూ ఆ పని చేయలేదు. సీఎం గారు... సీపీఎస్ రద్దు ఏమయ్యింది? పిఆర్సి ఇస్తే జీతాలు తగ్గుతాయని చెప్తున్నారు... ఇదెక్కడి చోద్యమో తెలియదు. కార్మికులు, ఉద్యోగులకు మళ్లీ సంక్షేమం జరగాలంటే టిడిపి అధికారంలోకి రావాలి'' అన్నారు ఏపీ టిడిపి చీఫ్ అచ్చెన్నాయుడు.
ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగిపోతున్నా వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ నిర్లక్ష్యాన్ని వీడటంలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలకంటే కక్షసాధింపు చర్యలకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. కరోనా కట్టడి కంటే కక్షసాధింపు చర్యలే ఈ ముఖ్యమంత్రికి మొదటి ప్రాధాన్యగా మారిపోవడం బాధాకరమని అచ్చెన్న మండిపడ్డారు.
