అమరావతి:  కరోనా టెస్ట్ ల విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే RT PCR టెస్ట్ లో ఖచ్చితత్వం   67 శాతమేనని...అంటే సంబంధిత వ్యక్తిలో 33 శాతం వైరస్ ఉనికి ఉన్నప్పటికీ టెస్ట్ ఫలితాలు నెగెటివ్ అనే చూపుతాయన్నారు. కోవిడ్ వైరస్ 100 శాతం ఖచ్చితంగా వుంటే ఫలితాలు పాజిటివ్ అని నిర్ధారిస్తాయన్నారు. అంటే ఆ వ్యక్తిలో  కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా వుందని అర్థమని... పేషెంట్ రికవరి దశలో వున్నప్పుడు కూడా (అంటే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన కొద్ది రోజుల తరువాత) టెస్ట్ ఫలితాలు నెగటివ్ అని చూపుతాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విషయంలో తొలి టెస్ట్ ఫలితాలు పాజిటివ్ అని చూపాయంటే ఆయన నూరుశాతం వైరల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారని అర్ధమని... రెండో టెస్ట్ నెగటివ్ అని చూపిందంటే అందుకు రెండు కారణాలున్నాయన్నారు. ఆయనలో వైరల్ ఇన్ఫెక్షన్ స్థాయి 33 శాతం మాత్రమే వుండటం లేదా ఆయన రికవరీ దశలో వుండటమన్నారు. ఈ దశలో కరోనా టెస్ట్ ఫలితాలు నెగెటివ్ అన్న ఫలితాలనే చూపుతాయని వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.  

read more   "అనంత" కరోనా ఆందోళన: మళ్లీ లాక్ డౌన్ అమలు

సాంకేతికపరమైన ఈ అంశాలపై స్పందించటానికి ముందు సంబంధిత వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.  కొందరు బాధ్యతా రహితంగా చేసే వ్యాఖ్యలు ల్యాబ్స్ లో పనిచేస్తున్న సంబంధిత సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల దృష్టిలో అనుమానాలు రేకెత్తించటం ఎవరికీ మంచిది కాదనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం అందరికీ ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

ఎమ్మెల్సీ దీపక్  రెడ్డి కరోనా వివాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ  ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలను ఆషామాషీగా చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

 ''కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లాటలు అయిపొయింది. వైఎస్ జగన్ గారు పారాసెటమాల్ మాటలు చెప్పినట్టే యంత్రాంగం కరోనా టెస్టులను ఆషామాషీగా చేస్తుందా అన్న అనుమానం వస్తోంది. టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారికి కరోనా టెస్టు చేసి పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్ కు రమ్మని హడావిడి చేసారు. తీరా దీపక్ రెడ్డిగారు హైదరాబాద్ లో రెండుసార్లు RT PCR పరీక్ష చేసుకుంటే రెండు చోట్లా నెగటివ్ అని వచ్చింది. ఒక ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే, ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారు వీళ్ళు? ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో ఏమిటీ నిర్లక్ష్యం? ''అంటూ లోకేష్ ప్రశ్నించారు.

''పాజిటివ్ అని నిర్ధారణ చేసుకోకుండా తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిగారిని క్వారంటైన్ లో పెట్టడానికి చేసిన హడావిడి చూస్తే.. ఇంకేదయినా కుట్ర చేసిందా ప్రభుత్వం అని కూడా అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా కరోనా పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందే'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రభుత్వంపై లోకేష్ విరుచుకుపడ్డారు.