అమరావతి: రాయలసీమ కరవు నివారణ పథకం ద్వారా 14 పనులను చేపట్టేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకొన్న నిర్ణయాలను ఏపీ మంత్రి పేర్నినాని గురువారంనాడు మీడియాకు వివరించారు.రైతుల సమస్యలను చూసే వైఎస్ఆర్ ఆనాడు ఉచిత విద్యుత్ ను అమల్లోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఉచిత విద్యుత్ పై ఎలాంటి పరిమితులు లేవని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీకి కేబినెట్ ఆమోదించినట్టుగా ఆయన చెప్పారు.

ఉచిత విద్యుత్ ను చంద్రబాబునాయుడు ఎగతాళి చేశారని ఆయన విమర్శించారు.  రైతుల ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఆయన ప్రకటించారు. రైతుల ఖాతాల నుండి ఆటో డెబిట్ ద్వారా డిస్కంలకు ద్వారా చెల్లించనున్నట్టుగా మంత్రి వివరించారు.

also  read:ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ: ఏపీ కేబినెట్ ఆమోదం

ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 8 వేల 300 కోట్లను ఖర్చు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రాష్ట్రంలో 18 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్టుగా మంత్రి తెలిపారు.

ఉత్తరాంధ్ర సాగు, తాగు నీటి అవసరాలను తీర్చేందుకు  8 లక్షల ఎకరాలకు సాగు నీరందించే రూ. 15 వేల కోట్లతో జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టుగా మంత్రి తెలిపారు.