అమరావతి: కరోనా సోకిన సమయంలోనే కాదు వైరస్ ప్రభావం తగ్గి కోలుకున్నాక కూడా ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారని కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. కాబట్టి కరోనా నుండి బయటపడిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని... సరైన అవగాహనతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. 

''దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతే స్థాయిలో ఉంటోంది. దీనికి తోడు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ సోకి కోలుకున్నవారు నిర్లక్ష్యంగా ఉండవద్దని... వైరస్ సోకిన సమయం కంటే ఆ తర్వాత రోజులే ముఖ్యమైనవని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్‌ నుంచి కోలుకోగానే ఇక తాము వైరస్ ను జయించామని.. తమ ఆరోగ్యానికి ఢోకా లేదనే అతివిశ్వాసంతో వ్యవహరించవద్దని, అలా అని మరీ భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు'' అని అన్నారు. 

read more   కరోనాను జయించిన 102 ఏళ్ల బామ్మ: సీక్రెట్ ఇదీ....

''కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత నిర్లక్ష్యంగా ఉంటే గుండె, మెదడు, కిడ్నీ వంటి కీలకమైన సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కోవిడ్ రీఇన్ఫెక్షన్‌ కేసులు ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్నంత మాత్రాన దానినుంచి దీర్ఘకాలిక రక్షణ పొందగలిగేంత రోగ నిరోధక శక్తిని పొందినట్లు కాదు. కోవిడ్ యాంటీబాడీలు కొందరిలో మూడు నెలలు, మరికొందరిలో ఆరు నెలలు క్రియాశీలంగా ఉంటాయని అధ్యయనాల్లో వెలుగుచూసినట్టు వైద్యులు చెబుతున్నారు'' అని తెలిపారు. 

''ఇక కొంతమందిలో యాంటీబాడీలు తగినంతగా వృద్ధి చెందకపోతే మరోసారి ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్‌ రాకముందు ఎలా అప్రమత్తంగా ఉన్నారో.. కోలుకున్న తర్వాత కూడా అంతే అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, మధుమేహం, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్లు అదనపు అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది'' అని సూచించారు. 

ఈ క్రింది జాగ్రత్తలు అవసరం: 
 

1) స్టెరాయిడ్స్ వాడిన వారిలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండవు. కాబట్టి తరచూ చెకప్ చేయించుకుంటూ ఉండాలి.

2) ఊపిరితిత్తులు ఎక్కువ ప్రభావానికి గురై ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఫోన్లలో మాట్లాడకూడదు. ఆయాసం ఎక్కువగా ఉంటే న్యుమోథొరాక్స్  అనే సమస్య తలెత్తవచ్చు. దీంతో ఛాతిలో ఐసిడి అనే పైపు వేయవలసి రావచ్చు.

3) దగ్గు ఎక్కువగా వస్తున్నట్టయితే సెకెండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. యాంటీబయోటిక్స్ వాడవలసి వస్తుంది.

4) జ్వరం మళ్లీ వస్తున్నట్టయితే మెనిన్జిటిస్ లేదా బ్రెయిన్ ఎఫెక్టు ఉండవచ్చు. సీఎస్ఎప్ అనాలసిస్ అవసరం. 

5) కిడ్నీ మరియు ఇతర సమస్యలు కూడా రావచ్చు. 

5) 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వైద్య సహాయం తీసుకోవాలి.

 ఏది ఏమైనా  వైరస్ యొక్క ప్రవృత్తి  రోజు రోజుకి మారుతూ ఉండటంతో, మనందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదని డాక్టర్ శ్రీకాంత్ హెచ్చరించారు.