అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై సీఎస్ అధ్యక్షతన జిల్లాల పునర్వవ్యవస్థీకరణ కమిటిని ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.బుధవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. రెండు గంటల పాటు  పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించారు.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో సరిహద్దులు, సాంకేతిక అంశాలను కూడ  ఈ కమిటి చర్చించనుంది.కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై చర్చ సాగిన సందర్భంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గం విషయమై చర్చించారు.

also read:ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం: 20 అంశాలతో ఎజెండా...

అరకు పార్లమెంట్ నియోజకవర్గం పలు జిల్లాల్లో విస్తరించింది. అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని  రెండు జిల్లాలుగా విభజిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడ సాగింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటును పూర్తి చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.శాండ్ కార్పోరేషన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాలు కూడ వ్యక్తమయ్యాయి.రాయలసీమలో కరువునివారణ కోసం ప్రాజెక్టుల  నిర్మాణం కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యంతో పాటు ఇతర ప్రాజెక్టులు కూడ దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

మరో వైపు వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ర్యాటిఫికేషన్ చేసింది. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను కూడ ఖరారు చేసినట్టుగా సమాచారం.