డోన్: కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లెలో దారుణం చోటుచేసుకుంది. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో బాగా నానిన మట్టి ఇల్లు గత రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న అక్కాచెల్లెల్లపై శిధిలాలు పడి ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రులు మరో గదిలో నిద్రిస్తుండటంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. 
 
షేక్షావలి, పర్వీన్ దంపతులు తమ ఇద్దరు కూతుల్లు ఇంద్రుస్ బి, షాహీన్ లతో కలిసి పూర్వీకుల నుండి వస్తున్న ఇంట్లో నివాసముంటున్నారు. ఇల్లు శిథిలావస్థలో ప్రమాదకరంగా వున్నా ఈ కుటుంబం అందులోనే నివసిస్తోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ ఇల్లు మరింత దెబ్బతింది. దీంతో గురువారం అర్దరాత్రి ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కాచెల్లెల్లపై శిధిలాలు పడ్డాయి. 

read more   కడపలో విషాదం: వాగు నీటిలో కొట్టుకుపోయిన దంపతులు

అయితే ఇంద్రుస్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే  మృతిచెందగా చెల్లి షాహీన్ తీవ్ర గాయాలతో బయటపడింది. ఆమెను కుటుంబసభ్యులు కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం.