కడప: కడప జిల్లాలో గురువారం నాడు విషాదం చోటు చేసుకొంది. పాగేరు వంతెనను ద్విచక్రవాహనం కొట్టుకుపోయి దంపతులు గల్లంతయ్యారు.  అయితే స్థానికులు భార్యను వెలికితీశారు. భర్త ఆచూకీ లభ్యం కాలేదు.

కడప జిల్లాలోని కమలాపురం- ఖాజీపేట రహదారిపై పాగేరు వంతెనపై ద్విచక్రవాహనంలో వెళ్తూ నీటి ఉధృతికి భార్యాభర్తలు గల్లంతయ్యారు.చిన్నచెప్పల్లికి చెందిన శరత్ చంద్రారెడ్డి కడపలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్ఓ గా పనిచేస్తున్నాడు.

తన భార్యను ఎడ్ సెట్ పరీక్ష రాయించేందుకు చాపాడుకు బైక్ పై తీసుకెళ్లాడు. పరీక్ష ముగిసిన తర్వాత భార్యను బైక్ పై కమలాపురం మీదుగా చిన్నచెప్పల్లికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

వంతెనపై వాగు మధ్యలోకి బైక్ వెళ్లిన సమయంలో నీటి ఉధృతిలో బైక్ కొట్టుకుపోయింది.  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఐశ్యర్యను కాపాడారు. శరత్ చంద్రారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. ఆయన కోసం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పరీక్ష రాసి  తిరిగి వస్తున్న సమయంలో భర్త తన కళ్ల ముందే కొట్టుకుపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.