Asianet News TeluguAsianet News Telugu

భాజపా సర్వేపై చంద్రబాబులో కలవరం

రాబోయే ఎన్నికల్లో ఒక్క సిఎం సీనియారిటీని మాత్రమే గుర్తుంచుకుని ఓట్లు వేయరని, ఎంఎల్ఏల పనితీరును కూడా చూస్తారని అమిత్ స్పష్టంగా చెప్పారట. తమ సర్వేలో పలువురు ఎంఎల్ఏలపై జనాల్లోని వ్యతిరేకత స్పష్టంగా బయటపడిందని అమిత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. 

Amitshah dissatisfaction over tdp mlas style of functioning

తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏల పనితీరుపై అమిత్ షా అసంతృప్తితో ఉన్నారా? టిడిపి పనితీరుపై బారతీయ జనతా పార్టీ సర్వే చేయించిందా? ఈ ప్రశ్నలకు భాజపా నేతలు అవుననే సమాధానం చెబుతున్నారు. ఇటీవల బాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడకు వచ్చారు గుర్తుందా? విజయవాడ వచ్చినపుడు అమిత్-చంద్రబాబునాయుడు భేటీ కూడా జరిగింది. అప్పుడే వారిద్దరి మధ్య సర్వే విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

నరేంద్రమోడి మూడేళ్ళ పాలనపై భాజపా దేశవ్యాప్తంగా సర్వే చేయించుకుందట. అందులో భాగంగానే ఏపిలో కూడా సర్వే జరిగింది. ఆ సర్వే వివరాలనే అమిత్, చంద్రబాబు చెవిన వేసారట. పలు అంశాలపై టిడిపి ఎంఎల్ఏల పనితీరుపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని చంద్రబాబుతో అమిత్ స్పష్టంగా చెప్పారట.

2014 ఎన్నికల్లో టిడిపి-భాజపా కూటమికి జనాలు పట్టం గట్టారంటే మోడి ఇమేజ్ తో పాటు చంద్రబాబు సీనియారిటీని కూడా జనాలు పరిగణలోకి తీసుకున్నారన్న విషయాన్ని అమిత్ సిఎంకు గుర్తు చేసారట.

అయితే, రాబోయే ఎన్నికల్లో ఒక్క సిఎం సీనియారిటీని మాత్రమే గుర్తుంచుకుని ఓట్లు వేయరని ఎంఎల్ఏల పనితీరును కూడా చూస్తారని అమిత్ స్పష్టంగా చెప్పారట. తమ సర్వేలో పలువురు ఎంఎల్ఏలపై జనాల్లోని వ్యతిరేకత స్పష్టంగా బయటపడిందని అమిత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. వారి పనితీరు మార్చుకోకపోతే గెలవటం కష్టమన్నఅభిప్రాయాన్ని అమిత్ వ్యక్తం చేసారట. మొత్తానికి అమిత్ షా చెప్పిన సర్వే వివరాలతో చంద్రబాబులో కలవరం మొదలైంది.

ఎందుకంటే, ఇప్పటికే ఎంఎల్ఏల పనితీరుపై చంద్రబాబు అనేకమార్లు సర్వేలు చేయించుకున్నారు. అందులో అత్యధిక ఎంఎల్ఏల పనితీరు ఆశాజనకంగా లేదని స్వయంగా చంద్రబాబే ఎన్నోమార్లు చెప్పారు. అదే విషయం భాజపా సర్వేల్లో కూడా తేలటం అందులోనూ సర్వే వివరాలను అమిత్ బయటపెట్టటంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందట. వీరిద్దరి భేటీ అయిన ఇన్ని రోజులకు సర్వే వివరాలు ఇరు పార్టీల నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios