భయం నీడలో ఏజెన్సీ ఎప్పడేమి జరుగుతుందోనని భీతిల్లుతున్న పార్టీలు కొనసాగుతున్న గ్రే హౌండ్స్ దళాల కూంబింగ్ మైదాన ప్రాంతాలకు తరలిపోతున్న నేతలు
భయం నీడలో ఏజెన్సీ ఏరియా బిక్కుబిక్కుమంటోంది. మొన్నటి వరకూ తీవ్రమైన చలిగాలులతో వణికి పోయిన ప్రజలు, నేతలు తాజాగా జరిగిన భారీ ఎన్ కౌంటర్ కారణంగా భయంతో వణికిపోతున్నారు. ఫలితంగా ఏజెన్సీ ఏరియా మొత్తానికి చలికాలంలో కూడా చమటలు పడుతున్నాయి. ఆంధ్ర ఒరిస్పా సరిహద్దుల్లోని మల్కన్ గిరి ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లొ 25 మంది మావోయిస్టులు మృతి చెందినప్పటి నుండి ఏపిలోని విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మొత్తం భయంతో భీతిల్లిపోతోంది.
అందులోను మృతిచెందిన వారిలో మావోయిస్టు అగ్ర నేతలుండటంతో పార్టీ రహితంగా పలువురు నేతలు కూడా భయతో వణికి పోతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ఏరియా మొత్తం నివురు గప్పిన నిప్పులా ఉంది. మామూలుగానే నేతలను, సామాన్య జనాలను కూడా మావోయిస్టులు తమ ఇష్టం వచ్చినట్లు లక్ష్యం చేసుకుని ప్రాణాలు తీస్తుంటారు. అందులోనూ ఇప్పటి పరిస్ధితుల్లో ఎప్పుడేమి జరుగుతుందో అర్ధంకాక బిక్కు బిక్కు మంటున్నారు.
దానికి తోడు ఇటీవలే మవోయిస్టులు వారోత్సవాలు నిర్వహించారు. ఆ సందర్భంగా ఎప్పుడేమి జరుగుతుందోనన్న ముందుజాగ్రత్తగా పోలీసులు పలువురు నేతలను ఏజెన్సీ ప్రాంతాల నుండి మైదాన ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందిగా సుమారుగా 200 మంది నేతలను హెచ్చిరించారు. అయితే, అప్పుడు పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయని పలువురు నేతలు ఇపుడు భారీ ఎన్ కౌంటర్ కూడా జరగటంతో తమ ప్రాంతాల నుండి మైదాన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని మొత్తం 11 మండలాల్లో మావోయిస్టుల ప్రాభవం చాలా ఎక్కువ. దాంతో పలువురు నేతలు, ప్రజలు చాలా సులభంగా మావోయిస్టులకు లక్ష్యాలుగా మారిపోతున్నారు. పై నియోజకవర్గాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండటం, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం రాకపోకలు తక్కువగా ఉండటంతో పాటు ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులు (ఏఓబి)కలిసి వుండటం మావోయిస్టులకు కలసి వస్తోంది.
పాడేరు నియోజకవర్గంలోని జి మాడుగుల, చింతపల్లి, జికె వీధితో పాటు అరకు నియోజకవర్గంలోని పెద్దబైలు, మంచింగ్ పుట్, అరకు మండలాల్లో మావోయిస్టుల సమస్య చాలా తీవ్రంగా ఉందన్న సంగతి అందరికీ విధితమే. ప్రస్తుతం జరిగిన భారీ ఎన్ కౌంటర్ మంచిగ్ పుట్ ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో పై మండలాల్లోని ప్రజలు, నేతలు ఎప్పుడేమి జరుగుతుందేమోనన్న భయంతో వణికిపోతున్నారు. దానికితోడు మావోయిస్టుల రాకపోకలు పై ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పార్టీ రహితంగా అందరూ నేతల చిరునామాలు మావోయిస్టులకు బాగా పరిచయమే.
ఇప్పటికిప్పుడు కాకపోయిన కాస్త సమయం తీసుకునైనా మావోయిస్టులు ప్రతీకార దాడులకు తప్పక దిగుతారన్న అనుమానంతో పై మండలాల్లోని నేతలు పలువురు ఆందోళన చెందుతున్నారు. గడచిన మూడు ఏళ్ళలో వివిధ కారణాలతో సుమారు 30 మందిని మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు తీయటమే నేతల భయానికి కారణం. సోమవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత గ్రేహౌండ్స్ పోలీసులు పై ఏఓబిలోని అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టారు.
దాంతో మంగళవారం ఉదయం కూడా మరోమారు జరిగన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దాంతో నేతల భయం మరింతగా పెరిగిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పై 11 మండాలాల్లో దాదాపు వెయ్యి మంది గ్రేహౌండ్స్ పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఒకవైపు గ్రేహౌండ్స్ దళాల గాలింపు చర్యలు, మరోవైపు మావోయిస్టుల నుండి ప్రాణభయంతో పై ప్రాంతాల్లోని వివిధ పార్టీల నేతలు, ప్రజలకు చలికాలంలోనే చెమటలు పడుతున్నాయి.
