టిడిపి చెప్పినట్లు జగన్నుఇపుడు విమర్శించినా రేపటి రోజున ఎన్నికలకు వెళితే తమ భవిష్యత్తు ఏమవుతుందోనని వారిలో వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
ఫిరాయింపు ఎంఎల్ఏల్లో భవిష్యత్తుపై అంతర్మధనం మొదలైందా? మొన్నటి ఎంఎల్సీ ఫలితాలు చూసిన తర్వాత వారిమధ్య తమ రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వైసీపీ తరపున గెలిచిన 21 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారు. అది పాత విషయమే అనుకోండి. వారిలో కొందరు మంత్రిపదవులపై హామీతోనే ఫిరాయించారన్నది బహిరంగ రహస్యం. అటువంటి వారిలో భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్, అత్తార్ చాంద్ భాషలున్నట్లు ఎప్పటి నుండో ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే మంత్రి పదవి విషయంలోనే భూమా-చంద్రబాబుకు మధ్య అనేకసార్లు వివాదం నడిచిందని కూడా ప్రచారం. భూమా హటాత్ మరణానికి ఆ వివాదం కూడా కారణమేనని భూమా అనుచరులు బాహాటంగానే ఆరోపించారు. ఒకవిధంగా చూస్తే ఫిరాయింపు ఎంఎల్ఏల్లో భూమానే గట్టివాడు. అటువంటిది టిడిపిలోకి వచ్చిన తర్వాత భూమా అంతటివాడికే దిక్కులేకపోతే ఇపుడు తమ గతేంటని మిగిలిన వారిలో చర్చ మొదలైందట. పైగా ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రిపదవులపై గవర్నర్ అభ్యంతరాలు చెబుతున్నట్లు టిడిపిలోనే ప్రచారంలో జరుగుతోంది. దాంతో మంత్రిపదవులపై ఎవరికైనా ఆశలుంటే అవి కూడా గల్లంతే.
పోనీ కార్పొరేషన్ ఛైర్మన్ అన్నా తీసుకుందామంటే అవి కూడా వచ్చే సూచనలు కనబడటం లేదు. ఎందుకంటే, పార్టీలోని సీనియర్ నేతలకే ఇంత వరకూ పూర్తిగా పంపకాలు కాలేదు. మధ్యలో ఫిరాయింపులను ఎవరు పట్టించుకుంటారు? పోనీ వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్టు దక్కుతుందా అంటే అదీ స్పష్టంగా చెప్పేందుకులేదు. ఎందుకంటే, వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాలు పెరుగుతాయని ఫిరాయింపుల సమయంలో చంద్రబాబు వారికి చెప్పారు. అయితే కేంద్రం వైఖరి చూస్తుంటే నియోజకవర్గాలు పెరిగేది కూడా అనుమానమే.
దానికితోడు ఫిరాయింపుల్లో చాలామందిని పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పైగా ఫిరాయింపుల్లో బలహీనులనుకున్న వారిపై టిడిపి నేతల అనుచరులు అక్కడక్కడ దాడులు కూడా చేస్తున్నారు. దానికితోడు మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన నాలుగు చోట్లా టిడిపి ఓడిపోవటం కూడా ఫిరాయింపుల్లో అభద్రతను పెంచింది. పైగా ఓడిపోయిన స్ధానాలన్నీ రాయలసీమ జిల్లాల్లో ఉండటం గమనార్హం. అంటే, రామలసీమలో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. ఓడిపోయిన అన్నీ చోట్లా టిడిపి మూడో స్ధానానికే పరిమితిమవ్వటం పట్ల టిడిపిలో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.
అయితే టిడిపిలో ఉన్నారు కాబట్టి అవసరార్ధం జగన్ విమర్శిస్తున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏల్లో అత్యధికులు వైసీపీ తరపున పోటీ చేసాముకాబట్టే గెలిచామన్న విషయం వారికి కూడా తెలుసు. కాకపోతే వ్యూహాత్మకంగా టిడిపి వారిచేతనే జగన్ను తిట్టిస్తోంది. టిడిపి చెప్పినట్లు జగన్నుఇపుడు విమర్శించినా రేపటి రోజున ఎన్నికలకు వెళితే తమ భవిష్యత్తు ఏమవుతుందోనని వారిలో వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే, రానున్న కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఈ పరిస్ధితుల్లో ఏం చేయాలన్నవిషయమై ఫిరాయింపుల్లో చర్చ జరుగుతోందని ప్రచారం.
