హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక తాను ఆ పార్టీ వీడానని సినీ నిర్మాత ఆది శేషగిరిరావు స్పష్టం చేశారు. గురువారం అమరావతిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీలో పాదర్శకత లేదని అందువల్లే తాను పార్టీ వీడానని తెలిపారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని ఈ నేపథ్యంలో ఆయన్ను అభినందించడానికి కలిశానని చెప్పుకొచ్చారు. 

వృద్ధాప్య పింఛన్ రూ.2000కి పెంచడం అలాగే డ్వాక్రా మహిళలకు రుణాలు వంటి పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయన్నారు. డ్వాక్రా రుణాల వల్ల దాదాపు 90 లక్షల మందికి చేయూతనిస్తోందన్నారు. అలాగే పలు రాజకీయ అంశాలు కూడా తమ భేటీలో చర్చకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. 

అయితే తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాన్న విషయంపై సమాధానం దాటవేశారు. వైసీపీలో పారదర్శకత లేకపోవడం వల్లే 15 రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 

తమ అభిమానులు, సోదరుడు కృష్ణతో సమావేశమై తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. తమకు రాజకీయాలు కొత్త ఏమీ కాదన్నారు ఆదిశేషగిరిరావు. తాము కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లుగా సేవలందించామని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నామన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 

జనవరి 8న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు త్వరలో సైకిలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 7 లేదా 8న టీడీపీలో చేరే అవకాశం ఉంది.  గుంటూరు ఎంపీ టిక్కెట్ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. 

కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీ తరపున గుంటూరు ఎంపీగా పనిచేస్తున్నారు. మరి ఆదిశేషగిరిరావు తెలుగుదేశం పార్టీలో చేరితో ఆయనకు చంద్రబాబు ఎలాంటి హామీ ఇస్తారో అన్నది వేచి చూడాలి.  
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుతో నేడు సూపర్ స్టార్ సోదరుడు భేటీ

టీడీపీలోకి ఆదిశేషగిరిరావు చేరే ముహుర్తమిదే!

జగన్ కు షాక్: పార్టీకి ఆదిశేషగిరి రావు రాజీనామా