కడప: కర్నూలు జిల్లాలో మంత్రి భూమా అఖిలప్రియకు, తెలుగుదేశం పార్టీ నేత ఏవి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు సద్దుమణిగాయో లేదో తెలియదు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారిద్దరికి మధ్య సయోధ్యను కుదర్చడానికి తీవ్ర ప్రయత్నమే చేయాల్సి వచ్చింది.

అది అలా ఉంటే, కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలి, మాటల తూటాలు చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపి నేత వీరశివా రెడ్డి ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై బహిరంగ విమర్శలే చేశారు. ఆ వ్యవహారం వీధికెక్కింది.

పైగా, ఆదినారాయణ రెడ్డిపై కడప జిల్లా ఇంచార్జీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఆయన ఫిర్యాదు చేశారు. జమ్మలమడుగు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు.

జమ్మలమడుగు టీడీపి ఇంచార్జీగా ఉన్న రామసుబ్బారెడ్డితో ఆయనకు తీవ్రమైన విభేదాలే ఉన్నాయి. ఆదిని పార్టీలోకి తీసుకోవడాన్ని రామసుబ్బారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా చంద్రబాబు ఆదిని పార్టీలోకి తీసుకుని ఆయన మంత్రి పదవి ఇచ్చారు. వారిద్దరి మధ్య విభేదాలు సద్దుమణిగిన సూచనలేవీ కనిపించడం లేదు. పెద్దగా బయటకు రావడం లేదు గానీ వారి మధ్య సయోధ్య సాధ్యం కాదని అందరికీ తెలుసు.

ఇదిలావుంటే, ఆదినారాయణ రెడ్డి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై తన నోటి దురుసును ప్రదర్శించారు. రమేష్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. తనపై ఆది చేసిన వ్యాఖ్యలకు సిఎం రమేష్ మౌనంగా ఉంటారా అనేది సందేహమే.

తాను గన్ లాంటివాడినని, పనులకు అడ్డు వస్తే కాల్చి పారేస్తారని ఆది నారాయణ రెడ్డి సిఎం రమేష్ పై వ్యాఖ్యానించారు.  దానితో ఆగకుండా రమేష్ పై ఆయన ఇంకా పలు వ్యాఖ్యలు చేశారు. ఆదినారాయణ రెడ్డిని నియంత్రించడం చంద్రబాబుకు సాధ్యమవుతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఏమైనా కడప జిల్లా వ్యవహారాలు చంద్రబాబుకు తల బొప్పి కట్టించే పరిస్థితులే ఉన్నాయి.