నంద్యాలలో మొత్తం 2.30 లక్షల ఓట్లలో బలిజల(కాపు) ఓట్లు సుమారు 26 వేలు. ఇక, కాకినాడ గురించి చెప్పనే అక్కర్లేదు. ఓ అంచనా ప్రకారం కార్పొరేషన్ పరిధిలో కాపుల ఓట్లు సుమారు 50 వేలు. అంటే, రెండు చోట్లా ఓ అభ్యర్ధి గెలుపోటముల్లో కాపులదే నిర్ణయాత్మక పాత్ర.

‘నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కాపు సామాజికవర్గం మొత్తం టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబునాయుడుకు బుద్ధి వచ్చెేట్లు చేయాలి’...ఇది తాజగా కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇచ్చిన పిలుపు.

ఆయన పిలుపుతో కాపు సామాజిక వర్గంపై ముద్రగడ పద్మనాభంకున్న ప్రభావం ఎంతో త్వరలో తేలిపోనున్నది. ఎలాగంటే, నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో కాపులెవరూ టిడిపికి ఓట్లు వేయవద్దని ముద్రగడ గురువారం పిలుపునిచ్చారు. కిర్లంపూడిలోని తన నివాసంలో 13 జిల్లాల కాపు జెఏసి నేతలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రిజర్వేషన్ల కోసం కాపుఉద్యమం చివరి దశకు చేరుకుందన్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని అమలు చేయించేందుకు చావో రేవో తేల్చుకోవాలన్నారు.

టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేయటం ద్వారా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కాపులు తమ సత్తా చాటాలన్నారు. కాపుల వ్యతిరేక ఓటు ద్వారా చంద్రబాబులో బుద్ది రావాలన్నారు. సరే, సమావేశంలో మామూలుగానే ప్రభుత్వంపై మండిపడ్డారనుకోండి అదివేరే సంగతి. విజయవాడ బెంజి సర్కిల్ నడిబొడ్డులో టిడిపి నేతలు ర్యాలీలు, సభలు పెట్టుకోవచ్చా? కాపు నేతలు పాదయాత్ర చేస్తామంటే మాత్రం శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందా? అంటూ చంద్రబాబును నిలదీసారు.

తాజా సమావేశంలో ముద్రగడ మరో కీలకమైన ప్రకటన చేసారు. ఈసారి ఉద్యమంలో మహిళలను ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే, స్త్రీశక్తి ముందు మరే శక్తి ఎదురు నిలవలేందట. మరి, ముద్రగడ చెప్పినట్లు కాపులందరూ నంద్యాల, కాకినాడలో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే అధికారపార్టీకి ఇబ్బందే. ఎందుకంటే, నంద్యాల, కాకినాడలో కాపుల సంఖ్య బాగా ఎక్కువే.

నంద్యాలలో మొత్తం 2.30 లక్షల ఓట్లలో బలిజల(కాపు) ఓట్లు సుమారు 26 వేలు. ఇక, కాకినాడ గురించి చెప్పనే అక్కర్లేదు. ఓ అంచనా ప్రకారం కార్పొరేషన్ పరిధిలో కాపుల ఓట్లు సుమారు 50 వేలు. అంటే, రెండు చోట్లా ఓ అభ్యర్ధి గెలుపోటముల్లో కాపులదే నిర్ణయాత్మక పాత్ర. మరి, కాపుల్లో ఎంతమంది ముద్రగడ మాట వింటారో రానున్న ఎన్నికల్లో తేలిపోతుంది.