సారాంశం

గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి అధికార దుర్వినియోగం చేసి కడప జిల్లాలో 52 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే.. 

Sajjala Ramakrishna Reddy : గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణా రెడ్డి హవా మామూలుగా సాగలేదు. ఆ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలిస్తే... ప్రభుత్వంలో భాగం కాకపోయినా సజ్జల కూడా సమాంతర పాలన సాగించారన్నది ఆనాటి ప్రతిపక్షాల ఆరోపణ. పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ వైఎస్ జగన్ తర్వాతి స్థానం ఆయనదే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఈ విశేషాధికారాలను ఉపయోగించుకుని సజ్జల భారీ అక్రమాలకు పాల్పడిన తాజాగా వెలుగులోకి వస్తుంది.  ఆయనతో పాటు కుటుంబసభ్యులపై కూడా ఇప్పుడు అటవీ భూముల కబ్జా ఆరోపణలు వచ్చాయి. 

సజ్జల రామకృష్ణా రెడ్డి కుటుంబసభ్యులు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే భూకబ్జాలకు పాల్పడినట్లు ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  కడప జిల్లాలోని సికె దిన్నె గ్రామ పరిధిలో ఏకంగా 52 ఎకరాల అటవీభూమినే కబ్జా చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన విచారణ కమిటీ తేల్చింది.   

మొత్తంగా సికె దిన్నె గ్రామ పరిధిలో ఒకేచోట 63 ఎకరాలకు పైగా  భూమిని సజ్జల కుటుంబం కబ్జాచేసి చుట్టూ పెన్సింగ్ వెసుకున్నట్లు ఆరోపణలు ఉన్నారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికేసి పర్యావరణాన్ని నాశనం చేసారని.. లగ్జరీ గెస్ట్ హౌస్ కట్టుకున్నారని ఆనాటి ప్రతిపక్షం, నేటి పాలకపక్షం టిడిపి ఆరోపిస్తోంది. తాజాగా సజ్జల భూకబ్జాల వ్యవహరంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. 

''గత ప్రభుత్వంలో 5 ఏళ్లు బ్లూ మీడియాను పార్టీ ఆఫీస్ కు పిలిపించుకుని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చిన సజ్జల నోరు నేడెందుకు మూగబోయింది. నాడు నారా చంద్రబాబు నాయుడు గారిపైనా, నాటి ప్రతిపక్ష పార్టీల ప్రజా పోరాటాలపైనా నీతి మాలిన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి... 64 ఎకరాల అటవీ, ఎసైన్డ్ భూముల కబ్జాపై సమాజానికి సమాధానం చెప్పి తీరాలి. అధికారం ఉన్నప్పుడు ఎగిరిపడిన ఆ తాడేపల్లి క్లర్క్... తప్పులు, నేరాలు,ఘోరాలు చేశాడు కాబట్టే నేడు కలుగులో దాక్కున్నాడు. అటవీ భూములు మింగేసిన సజ్జలపై కూటమి ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను'' అంటూ సోమిరెడ్డి ఎక్స్ వేదికన రియాక్ట్ అయ్యారు.