విశాఖలోని జంతు ప్రదర్శన శాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో దాన్ని సంరక్షించే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూ పార్కులో విషాదం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడి ఘటనలో ఓ సంరక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని జూలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న బానాపురపు నగేష్(23) గా గుర్తించారు. రోజూ మాదిరిగానే నగేష్ అనే ఉద్యోగి సోమవారం ఉదయం జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తున్నాడు. ఎలుగుబంటి ఎన్‌క్లోజర్ లో ఉందని భావించి ఆ ఉద్యోగి క్లీనింగ్ లో మునిగిపోయాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది.
వాస్తవానికి ఎలుగుబంటి బోను తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించకపోవటంతో నగేష్ దాడికి గురయ్యాడు. తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. ఆ ఎలుగుబంటి అతడిపై తీవ్రంగా దాడి చేసి చివరికి ప్రాణాలు తీసింది. జూలో సందర్శకులు చూస్తుండగానే ఈ ఆకస్మాత్తుగా దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దారుణాన్ని చూసిన సందర్శకులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిని గుర్తించిన మరో ఉద్యోగి వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ఎలుగుబంటిని బంధించారు. మరోవైపు.. తీవ్ర గాయపడ్డ ఆ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలను క్యూరేటర్ నందినీ సలారియా వివరించారు. రోజూ మాదిరిగానే సోమవారం జిహ్వాన్ అనే ఎలుగుబంటి ఉండే ఎన్‌క్లోజర్‌ను నగేష్ అనే ఉద్యోగికి డ్యూటీ వేశామని తెలిపారు. జూలోని పశువైద్యుడు సాధారణ తనిఖీలో భాగంగా ఈ ఎలుగుబంటి ఉండే బోను దగ్గరికి వెళ్లారు. అక్కడి సెక్యూరిటీ గార్డ్‌ను నగేష్ కోసం అడగ్గా.. ఎన్‌క్లోజర్ శుభ్రం చేయడానికి వెళ్లాడంటూ సెక్యూరిటీ తెలిపారు. కానీ.. ఎంత పిలిచిన స్పందన లేకపోవడంతో లోపలకు వెళ్లి చూడగా ఎలుగుబంటి కనబడటంతో భయంతో పరుగు తీశాడు ఆ సెక్యూరిటీ. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఎలుగుబంటిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆ ఎన్‌క్లోజర్‌లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన నగేష్ ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నగేష్ స్వస్థలం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని టి.బూర్జవలస. గత రెండేళ్లుగా నగేష్ జూలో విధులు నిర్వహిస్తున్నాడని, మృతుని కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించినట్లు క్యూరేటర్ సలారియా వెల్లడించారు.
