అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు పడిపోయాయి. గత ఆర్ధిక ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం అమ్మకాలు పడిపోయినట్టుగా ఏపీ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ఎన్నికల ప్రచారంలో దశలవారీగా రాష్ట్రంలో మద్య నియంత్రణను అమల్లోకి తీసుకువస్తామని వైసీపీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ ఈ దిశగా చర్యలు తీసుకొంది. మద్యం ధరలను భారీగా పెంచింది.

అయితే మద్యం ధరల పెంపుతో ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తెచ్చుకొనే వారి సంఖ్య కూడ పెరిగిందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో మద్యం ధరలను గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వినియోగంలో గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 65 శాతం తగ్గినట్టుగా రాష్ట్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

బీరు వినియోగం రాష్ట్రంలో 91.76 శాతం తగ్గింది.మద్యంపై రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 28.411 శాతం తగ్గింది.గత ఏడాది ఏప్రిల్ నుండి  ఆగష్టు వరకు జరిగిన అమ్మకాలను ఈ ఏడాదితో పోలిస్తే 32.48 శాతం తగ్గింది.

గత ఏడాది ఏప్రిల్ నుండి ఆగష్టు వరకు తెలంగాణలో 0.31 శాతం మాత్రమే మద్యం వినియోగంలో తగ్గుదల ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆదాయం మాత్రం పెరిగింది.గత ఏడాదితో పోలిస్తే 2.93 శాతం పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అమ్మకాల విలువలో 4.66 శాతం వృద్ధి నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

also read:మద్యం ప్రియులకు గుడ్ న్యూస్: లిక్కర్ ధరలను సవరించిన ఏపీ సర్కార్

2019 సంవత్సరంలో ఏప్రిల్ నుండి  ఆగష్టు వరకు ఏపీ రాష్ట్రంలో  మద్యం విక్రయాల ద్వారా 7,638.24 కోట్లు వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం రూ.5,468.17 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది.

మద్యం, బీరు అమ్మకాలను పరిశీలిస్తే కూడ ఇవే లెక్కలు చెబుతున్నాయి. 2019 లో ఏప్రిల్ నుండి ఆగష్టు వరకు  రూ.8,884.69 కోట్లు కాగా, ఈ ఏడాది కేవలం రూ.5,998.87 కోట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే రూ.2,885.82 కోట్లు తక్కువగా ఉన్నట్టుగా ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.