నేరస్తులకు రక్షణ కవచంగా 17ఏ మారొద్దు: సుప్రీంలో సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు , సీఐడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాడీ వేడీగా వాదనలు వినిపించారు.
న్యూడిల్లీ: 17 ఏ చట్ట సవరణ అనేది నేరస్థులకు రక్షణ కవచంగా మారకూడదని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై మంగళవారంనాడు సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. 2018 కి ముందు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ కొంతవరకు సాగి నిలిచిపోయిందన్నారు. అంతమాత్రాన విచారణ జరగలేదని చెప్పడం సరైంది కాదని ఆయన వాదించారు.2018లోనే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మెమో దాఖలు చేసిన విషయాన్ని రోహత్గీ గుర్తు చేశారు. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లను బెంచ్ ముందుంచుతున్నామని చెప్పారు.విచారణ ముగిశాక కాగితాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
also read:చంద్రబాబుకు చుక్కెదురు: లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు నిరాకరణ
వాదనలు జరుగుతున్న సమయంలో 400 పేజీలను హైకోర్టు బెంచ్ ముందు ప్రవేశ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్ లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడవద్దని రోహత్గీ కోరారు.చంద్రబాబుపై తగిన ఆధారాలు దొరికన తర్వాతే 2021లోనే కేసు నమోదు చేశారని రోహత్గీ వాదించారు. ఈ కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ కేసు విచారణ సాగుతున్నట్టుగానే పరిగణించాలని ఆయన కోర్టును కోరారు. చట్టసవరణకు ముందున్న ఆరోపణలకుఅంతకుముందున్న చట్టమే వర్తిస్తుందని రోహత్గీ వాదించారు. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17 ఏ వర్తించదన్నారు.
17ఏ అన్నది నేరం కేంద్రంగా జరుగుతుందా, వ్యక్తి కేంద్రంగా జరుగుతుందా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు.అవినీతి నిరోధక చట్టం అమలు కానప్పుడు మిగిలినవన్నీ పరిగిణనలోకి తీసుకోవద్దని పిటిషన్లర్ల తరపు న్యాయవాదులు చెబుతున్నారని జస్టిస్ త్రివేది రోహత్గీ దృష్టికి తెచ్చారు.
అవినీతి నిరోధక చట్టమే వర్తించనప్పుడు అసలు కేసు మూలాల నుంచి కొట్టేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు చెబుతున్నారని జస్టిస్ త్రివేది చెప్పారు. అవినీతి నిరోధక చట్టం వర్తించనప్పుడు సెక్షన్ 420 కింద మోసపూరిత చర్యగా పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గీ కోరారు. 420 పరిగణనలోకి తీసుకోవాలంటే అవినీతి నిరోధక చట్టం వర్తించదని కాదన్నారు. అనేక రకాల నేరాలు కలగలసి ఉన్నప్పుడు స్పెషల్ జడ్జికి విచారణాధికారం ఉంటుందని రోహత్గీ వాదించారు.అవినీతి నిరోధక చట్టం వర్తించదని అనుకున్నప్పుడు ఇతర చట్టాలకు అనుగుణంగా విచారణ జరపాలని రోహత్గీ కోరారు.
నేరం ఎప్పుడు జరిగిందో అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలన్నారు.. పరిణామక్రమంలో చట్టంలో వచ్చిన మార్పులను పాత నేరాలకు వర్తింపచేయకూడదని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.చట్ట సవరణలతో ఎలాంటి పరిణామాలు వచ్చాయన్నది కాదు.. ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలన్నారు. 17 ఏ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయవచ్చని రోహత్గీ చెప్పారు.17 ఏ ప్రకారం విచారణ ఇన్వేస్టిగేషన్ దేనికి అవకాశం లేదన్న సుప్రీంకోర్టు బెంచ్ రోహత్గీ దృష్టికి తెచ్చింది.
17 ఏ అన్నది అవినీతిని నిరోధించడం కోసమే పార్లమెంట్ తీసుకు వచ్చిందని రోహత్గీ చెప్పారు. భారీ ఎత్తున అవినీతి జరిగినప్పుడు అంతులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కేవలం అధికార విధుల నిర్వహణగా పరిగణించలేమని ఆయన వాదించారు.
నిజాయితీ పరులైన అధికారులు, ప్రజా ప్రతినిధులను అనవసర భయాల నుండి దూరం చేయడం కోసమే ఈ సవరణ చేశారని రోహత్గీ వాదించారు.ఒకవేళ నేరం 2012, 2013లో జరిగిన 17 ఏను రక్షణగా వాడుకుంటారా అని సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్ పై విచారణను రెండు గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.