రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వదలచుకుంటే ఇపుడు కూడా కేంద్రప్రభుత్వం ఇవ్వచ్చని వైవి రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో ఇంతకాలం కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, అరుణ్ జైట్లీ తదితరులు చెబుతున్నదంతా భూటకమేనని మరోసారి తేలిపోయింది.
14వ ఆర్ధిక సంఘం వద్దన్నదని, పొరుగు రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయంటూ మరోసారి తమ ఇష్టం వచ్చినట్లు కేంద్రమంత్రులు చెప్పారు. అయితే, తాజాగా 14వ ఆర్ధికసంఘానికి ఛైర్మన్ గా పనిచేసిన వైవి రెడ్డి కేంద్రమంత్రుల వాదననుకొట్టేసారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వదలచుకుంటే ఇపుడు కూడా కేంద్రప్రభుత్వం ఇవ్వచ్చని వైవి రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గడచిన రెండున్నరేళ్ళుగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కని విషయం అందరికీ తెలిసిందే. హోదా కోసం ప్రతిపక్షాలు, ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు.
హోదా ఇవ్వకపోవటానికి వెంకయ్య తదితరులు ఎన్నోమార్లు 14వ ఆర్ధికం సంఘం సిఫారసులే కారణమన్నట్లు కలరింగ్ ఇచ్చారు. చివరకు ఏవో కారణాలు చెబుతూ రాష్ట్రానికి నామం పెట్టారనుకోండి అది వేరే సంగతి.
అయితే, తాజాగా వైవి రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఇవ్వటానికి తమ సిఫారసులకు ఏమీ సంబంధం లేదని స్పష్టం చేసారు. ప్రత్యేకహోదా ఇవ్వొదని తాము ఎప్పుడూ సిఫారసులు కూడా చేయలేదని చెప్పటం గమనార్హం.
అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వటమా? మానటమా అన్నది కేవలం రాజకీయపరమైన నిర్ణయం. ఈ విషయంలోనే లాభ నష్టాలు భేరీజు వేసుకున్న ప్రధానమంత్రి హోదా ఇవ్వకూడదని అనుకున్నారు.
ఆ విషయం నేరుగా చెప్పకుండా వెంకయ్య తదితరలు పిల్లిమొగ్గలు వేసారు. ఏ విషయమైనా నేరుగా చెబితే వాళ్లు రాజకీయ నేతలు ఎందుకవుతారు? అందులో వెంకయ్య, చంద్రబాబులు ఎందుకవుతారు?
కేంద్రం వేసిన పిల్లిమొగ్గలకు తగ్గట్లే చంద్రబాబు కూడా తాళం వేసారు. ఒకసారి ప్రత్యేకహోదా సంజీవని కాదన్నారు. మరోసారి హోదా లేకపోతే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని..ఇలా తన ఇష్టం వచ్చినట్లు మాటలు మార్చారు.
అఫ్ కోర్స్ కేంద్రం డైరెక్షన్లోనే అంతా సాగిందనుకోండి అది వేరే సంగతి. అధికారం రాకముందు నరేంద్రమోడి, వెంకయ్యనాయడు, చంద్రబాబు హోదాపై ఏమి మాట్లాడారు, అధికారం అందుకున్నాక ఎన్ని పిల్లి మొగ్గలు వేసారో జనమంతా చూసారు.
అధికారం కోసం ఓ మాట, కుర్చీలో కూర్చున్న తర్వాత ఇంకో మాట మాట్లాడటం తమకు మాత్రమే వచ్చనుకుంటున్నట్లున్నారు నేతలు. తమ హామీలను నమ్మి ఓట్లేసిన జనాలను వెర్రోళ్ళను చేశామని పాలకులు అనుకోవటం సహజమే.
అలా అనుకునే వాళ్ళే వెర్రోళ్ళని గతంలో ఎన్నోమార్లు ప్రజలు నిరూపించారు. చూద్దాం, ఇంకెంత కాలం పాలకులు భ్రమల్లో బ్రతుకుతారో? రేపటి ఎన్నిక రోజున ఎవరు వెర్రోళ్ళో తేలిపోతుంది కాదా?
