Jan 16, 2023, 5:26 PM IST
ఖమ్మం జిల్లా: మరో రెండ్రోజుల్లో ఖమ్మం జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పనుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. జనవరి 18న జరిగేది కేవలం అభివృద్ది, రాజకీయ సభ మాత్రమే కాదు చారిత్రక సభగా పేర్కొన్నారు. వంద ఎకరాల్లో బహిరంగ సభ, 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసామని అన్నారు. సభాస్థలిలో వెయ్యిమందికి పైగా వాలంటీర్లు అందుబాటులో వుంటారన్నారు. జనసమీకరణ కోసం నియోజక వర్గాల వారీగా ఇంచార్జీలను నియమించామని... ముఖ్యంగా 13 నియోజకవర్గాల నుండి ఎక్కువగా సమీకరణ చేయనున్నట్లు తెలిపారు. రేపు(మంగళవారం) రాత్రికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకుంటారని... 18న (బుధవారం) ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని హరీష్ తెలిపారు. హైదరాబాద్ నుడి యాదాద్రి ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారని... అక్కడి నుండి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో ఖమ్మం చేరుకుంటారని తెలిపారు. వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అనంతరం భారీఎత్తున నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని మంత్రి హరీష్ తెలిపారు.