Jukkal MLA
Jukka MLA Thota Laxmi Kantha Rao : నేటి రాజకీయాల్లో రాణించాలంటే పైరవీలు చేయడం తెలుసుండాలి. గ్రామ సర్పంచ్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాని వరకు పైరవీ చేసినవారికే పదవులు. పార్టీ పెద్దలను మంచి మాటలతోనో, డబ్బు మూటలతోనో మెప్పించినవారికే ఏ పదువులైనా. ప్రజా సేవ చేసేవారికి పదవులు దక్కడం నేటి రాజకీయాల్లో చాలా కష్టం. ఇలా పైసా, పవర్ పాలిటిక్స్ జమానాలో పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఓ సాధారణ యువతికి నామినేటెడ్ పదవిని కట్టబెట్టి శభాష్ అనిపించుకుంటున్నారు ఓ తెలంగాణ ఎమ్మెల్యే.
Jukkal MLA
రాజకీయ పదవికి పరీక్ష, ఇంటర్వ్యూ :
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర బార్డర్ లో వుంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీచేసిన తోట లక్ష్మికాంతరావు విజయం సాధించారు. ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ ఏర్పాటుచేసింది... కాబట్టి నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎమ్మెల్యే చేతుల్లోనే వుంది.
సాధారణంగా నామినేటెడ్ పదువుల భర్తీ ఎలా వుంటుందంటే... రాష్ట్రస్థాయిలో అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ పెద్దల అనుచరులు, వారు సూచించినవారు లేదంటే పైరవీలు చేసుకునేవారికి ఈ పదవులు దక్కుతాయి. ఇక నియోజకవర్గస్థాయిలో అయితే ఎమ్మెల్యే ఎవరిని ఎంపికచేస్తే వారికే దక్కుతాయి. అంటే జుక్కల్ నియోజకవర్గంలో ఏ నామినేటెడ్ పదవి అయినా ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కనుసన్నల్లోనే భర్తీ కావాలి.
అయితే ఇటీవల జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పదవి ఎస్సి మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఈ మార్కెట్ కమిటీ పరిధిలోని మద్నూర్, జుక్కల్,డొంగ్లి మండలాల కాంగ్రెస్ నాయకులు ఈ పదవి కోసం ప్రయత్నించారు. కానీ ఈ పదవిని అన్ని అర్హతలు కలిగిన మహిళకే ఇవ్వాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే సరికొత్తగా ఎంపిక ప్రక్రియను చేపట్టారు.
ముందుగా ఈ పదవి కేవలం రాజకీయ నాయకులకే కాకుండా సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. ఈ పదవిని ఆశించేవారికి వ్యవసాయం గురించి ఎంత అవగాహన వుందో తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత వారికి స్వయంగా ఇంటర్వ్యూ నిర్వహించారు ఎమ్మెల్యే. ఈ ప్రాసెస్ పారదర్శకంగా సాగేలా 3 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మరో ముగ్గురు సీనియర్ నాయకులతో ఓ కమిటీని ఏర్పాటుచేసారు.
ఈ కమిటీ పర్యవేక్షనలో క్వశ్చన్ పేపర్ రూపొందించి మద్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పదవిని ఆశించేవారికి పరీక్ష నిర్వహించారు. అంతేకాదు రాత పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారికి ఎమ్మెల్యేతో పాటు కమిటీ సభ్యులు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇలా మొత్తం 15 మందిని పరీక్షించిన ఎమ్మెల్యే చివరకు మంచి విద్యావంతురాలైన ఆయిల్వార్ సౌజన్యను మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా నియమించారు.
Jukkal
ఎవరీ సౌజన్య :
ఆయిల్వార్ సౌజన్య... జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్డి గ్రామానికి చెందిన సామాన్య యువతి. ఈమె ఉన్నత విద్యావంతురాలు... ఎమ్మెస్సి,బిఈడి పూర్తిచేసారు. ప్రజాసేవ చేయాలని తాపత్రయపడే ఆమెకు మద్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పదవికి పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిసిందే. ఇదే మంచి అవకాశంగా ఆమె ఈ పదవి కోసం సిన్సియర్ గా ప్రయత్నించారు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన సౌజన్య మార్కెట్ కమిటీ పదవికోసం నిర్వహించిన పరీక్షలో మంచి మార్కులు సాధించారు. ఇక ఇంటర్వ్యూలో కూడా ఆమెకు వ్యవసాయంపై వున్న అవగాహనను బైటపెట్టారు. ఇలా పరీక్ష,ఇంటర్వ్యూలోనూ మిగతావారికంటే మంచి మార్కులు సాధించి ఎట్టకేలకు మద్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని పొందారు.
తాజాగా జుక్కల్ ఎమ్మెల్య లక్ష్మికాంతరావు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ను తీసుకుని హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా ఆమెను ఎలా ఎంపికచేసారో తెలుసుకుని మంత్రి ఎమ్మెల్యేను అభినందించారు. ప్రతి ఎమ్మెల్యే ఇలాగే ఆలోచిస్తే రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టించవచ్చని కోమటిరెడ్డి అన్నారు. మద్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా ఎంపికైన సౌజన్యకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Jukkal
ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఏమన్నారంటే :
రాజకీయాల్లో మార్పులు తీసుకువచ్చేందుకే ఈ ప్రయోగం చేసినట్లు ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు తెలిపారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లో రావాలని... అప్పుడే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని అన్నారు. అందుకే చదువుకున్నోళ్లు, అన్నింటిపై అవగాహన ఉన్నోళ్లకు పదవులు ఇస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు.
వ్యవసాయంపై మంచి అవగాహన కలిగిన సౌజన్య మద్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా ఎంపిక కావడం ఆనందంగా వుందన్నారు. ఇలాగే మరింతమంది యువతను రాజకీయాల్లోకి తీసుకువస్తానని తెలిపారు. ప్రతిభ కలిగినవాళ్లకే పదవులు దక్కుతాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు స్పష్టం చేసారు.