Jan 18, 2023, 4:30 PM IST
యాదగిరిగుట్ట : భారత రాష్ట్ర సమితి నిర్వహించే ఖమ్మం బహిరంగ సభకోసం తెలంగాణకు విచ్చేసిన వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎం, జాతీయ జాతీయ నాయకులు యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లలో డిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సిపిఐ జాతీయ నాయకుడు డి రాజా తదితరులను సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. హెలికాప్టర్ దిగగానే నాయకులంతా ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు. ఇక్కడి నుండి యాదిగిరిగుట్ట ఆలయాన్ని, పరిసరాలను డిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చూపించారు సీఎం కేసీఆర్. కేరళ సీఎం విజయన్, సిపిఐ నేత రాజా గెస్ట్ హౌస్ లోనే వుండిపోగా కేసీఆర్ తో కలిసి కేజ్రీవాల్, భగవంత్ మన్, అఖిలేశ్ యాదవ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించి నాయకులతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం సీఎంలు, మాజీ సీఎంకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేసారు.