మియాపూర్ భూదందా ఆరోపణలు... ఎమ్మెల్యే రఘునందన్ కు తోట చంద్రశేఖర్ కౌంటర్

Jan 18, 2023, 11:36 AM IST

ఖమ్మం : నాలుగు వేలకోట్ల విలువైన మియాపూర్ భూముల భూములను సీఎం కేసీఆర్ అప్పగించాడంటూ తనపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణకు ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కౌంటరిచ్చారు. ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నుండి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపణలే నిజమైతే ఆ సర్వే నెంబర్ భూమిలో 90శాతం మీరే తీసుకోవాలని, మిగిలిన 10శాతం తనకిస్తే చాలన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, నిరాధార ఆరోపణలు మానుకోవాలని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీ దేశ భవిష్యత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేసాడని అన్నారు. తెలంగాణ ప్రగతిని ఏపీతో పాటు దేశానికి పరిచయం చేయనున్నాడని అన్నారు. త్వరలోనే విశాఖపట్నంలో కేసీఆర్ ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ బహిరంగ సభ  ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తోట చంద్రశేఖర్ వెల్లడించారు.