నాన్న కోలుకుంటున్నారు... అభిమానులూ అర్ధం చేసుకోండి: ఎస్పీ చరణ్ (వీడియో)

Aug 25, 2020, 10:04 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఆయన తనయుడు మంగళవారం స్పందించారు. నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన క్రమక్రమంగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ ఓ వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. 

ఇందులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతానికి నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ట్రీట్‌మెంట్‌కి స్పందిస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల బృందం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న కోలుకోవడంలో వాళ్ళు నిరంతరం కష్టపడుతున్నారు.

త్వరలోనే నాన్నగారు కోలుకుని బయటకు వస్తారని నమ్ముతున్నా. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీర్వాదానికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది` అని చెప్పారు. తన అప్‌డేట్‌ గురించి చెబుతూ, నాన్నగారి ఆరోగ్యం గురించి తమిళంలో అప్‌డేట్‌ ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు.

కానీ నాన్నకి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వేల పాటలు పాడారు. అన్ని భాషల్లో అప్‌డేట్‌ పెట్టడం కష్టం. నాన్న కోసం ప్రేయర్‌ చేయడం, వైద్యులతో మాట్లాడటం, అప్‌డేట్స్ ఇవ్వడానికి నాకు సమయం సరిపోవడం లేదు.

నేను చెప్పేది అర్థంకాని వారు, అర్థమైన వారి నుంచి తెలుసుకోవాలని కోరుకుంటున్నా` అని చెప్పారు. గత రెండు వారాలుగా గాయకుడు బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఎక్మో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఫారెన్‌ వైద్య బృందం ఆయన కో్సం పనిచేస్తుంది.