సాధారణంగా ఒక మనిషి సంపాదన రోజుకు 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. జాబ్ చేసే వాళ్లయినా, చిరు వ్యాపారాలు చేసే వారికైనా సుమారుగా ఇంతే ఉంటుంది. జాబ్స్ లో పెద్ద పొజిషన్ లో ఉన్న వారైతే నెలకు రూ. 50 వేల నుంచి రూ.లక్షకు పైగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాని మన దేశ రాజధాని ఢిల్లీలో కేవలం చాట్ అమ్ముతూ రోజుకు రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా సంపాదించే వారు ఉన్నారు. అలా అని వారంతా పెద్ద పెద్ద హోటల్స్ నిర్వహిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారని అనుకోవద్దు. వీధుల్లోనే రోడ్డు పక్కన చిన్న బడ్డీలు, బండ్లు పెట్టుకొని చాట్ అమ్ముతుంటారు. ఢిల్లీలో చాట్ విక్రయించే చిరు వ్యాపారులు సుమారు 70 వేల కు పైగా ఉన్నారని ఓ సర్వే నివేదికలో ఉంది.
అలాంటి వ్యాపారుల్లో సియా రామ్ ఒకరు. ఆయన ఢిల్లీలో ఘుగ్ని, ఛోలే కుల్చా(చాట్ బఠాని, జొన్నరొట్టెలు) అమ్మి రోజుకు రూ.లక్ష వరకు సంపాదిస్తున్నానని చెబుతున్నారు. ఆయన ఈ వ్యాపారాన్ని 60 ఏళ్లుగా చేస్తున్నారట. అందువల్ల ఆయన ఢిల్లీ లో చాలా ఫేమస్ వ్యక్తిగా మారిపోయారు. ఢిల్లీలో ఉండేవారు కాని, అక్కడికి పనులపై వచ్చిన వారు కాని కచ్చితంగా సియా రామ్ దగ్గరకు వచ్చి ఘుగ్ని తినేసి వెళతారు. అంతలా ఆయన ఫేమస్ అయ్యారు.
ఆయన విజయ రహస్యం తెలుసుకుంటే బిజినెస్ చేయాలని ఆసక్తి ఉన్న ఉద్యోగులు జాబ్స్ వదిలేసి అర్జెంట్ గా వ్యాపారంలోకి దిగిపోదాం అనుకుంటారు. సియా రామ్ లాంటి వీధి వ్యాపారులు ఢిల్లీలో వీధికి ఒకరుంటారు. అయితే ఎవరి వ్యాపారం వారిదే. లోకల్ గా ఉండే ప్రజలు ఇప్పటికే వారికి రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయారు. సియా రామ్ ప్రత్యేకత ఏంటంటే చాట్ తయారీలో నాణ్యత, రుచిని మెయింటెయిన్ చేస్తారు. అందుకే కస్టమర్లు ఆయన వద్దకే వెళ్లి చాట్ తింటారు. సెంట్రల్ మార్కెట్‌లో బట్టల దుకాణాల పక్కన రోడ్డు పైనే ఆయన ఛోలే కుల్చా దుకాణం నిర్వహిస్తుండటం విశేషం. ప్రతిరోజూ ఆలీగఢ్ నుండి ఢిల్లీకి వచ్చి ఆయన ఈ వ్యాపారం చేస్తుంటారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఇంకా పెద్ద ఉద్యోగ్యాలు చేసేవాళ్ళు తప్ప రూ.లక్షల్లో సంపాదించడం కష్టం. మరి ఢిల్లీలో వీధి వ్యాపారులు కేవలం చాట్ అమ్మి రూ.లక్షల్లో సంపాదిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.