Oct 2, 2022, 10:15 AM IST
విజయవాడ : నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏడవరోజయిన ఇవాళ (ఆదివారం) విజయవాడ కనకదుర్గమ్మ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే నేడు అమ్మవారి జన్మనక్షత్రం (మూల) తో పాటు ఆదివారం సెలవురోజు కావడం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుండే భక్తులు అమ్మవారి దర్శనంకోసం రావడంతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ రద్దీని ముందే ఊహించిన పోలీసులు కెనాల్ రోడ్డులోని వినాయక ఆలయం నుండి కంపార్ట్ మెంట్స్ ఏర్పాటుచేసారు. ఇలా మొత్తం 27 కంపార్ట్ మెంట్స్ ఏర్పాటుచేసి భక్తులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలక్టర్ ఢిల్లీ రావు దగ్గరుండి పర్వక్షించారు. అయితే కంపార్ట్ మెంట్స్ లో ఏర్పాట్లు, పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటలతరబడి వేచివుండాల్సిన కంపార్ట్ మెంట్స్ లో కింద బురద వుండటంతో కూర్చోలేని పరిస్థితి వుందని భక్తులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కొందరు కెనాల్ రోడ్డులో ఏర్పాటుచేసిన బారికేడ్స్ దాటి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసారు. దీంతో పోలీసులు, భక్తులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా అదనపు సిబ్బంది వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేసారు.