Jan 15, 2023, 10:47 AM IST
మచిలీపట్నం : సంక్రాంతి పండగ సందర్భంగా సాంప్రదాయంగా జరుపుకునే కోడి పందేలను చూసిచూడనట్లు వదిలేస్తున్న పోలీసులు సంబరాల పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో కోడిపందేల మాటున అమ్మాయిలతో అసభ్య డ్యాన్సులు, క్యాసినో ఏర్పాటు చేసినట్లు డిజిపికి ఓ అజ్ఞాతవ్యక్తి ఫిర్యాదు చేసాడు. దీంతో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో అంపాపురంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయన్నది తప్పుడు సమాచారమని... తమ తనిఖీలో అమ్మాయిలెవ్వరూ పట్టుబడలేదని అన్నారు. అయితే ఎస్పీ రాకపై ముందస్తు సమాచారం వుండటంతో స్థానిక పోలీసులే నిర్వహకులకు సమాచారమిచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్పీ తనిఖీలకు వెళ్లేసరికి అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా కేవలం సాంప్రదాయ ఆటలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు షో చేసినట్లు తెలుస్తోంది.