400 రోజులు 4వేల కిలోమీటర్లు... లోకేష్ 'యువ గళం' పాదయాత్ర లోగో ఆవిష్కరణ

Dec 28, 2022, 3:05 PM IST

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తండ్రి బాటలో పయనించి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన 2023 సంవత్సరమంతా రాష్ట్రం మొత్తాన్ని కాలినడకన చుట్టివచ్చేందుకు సిద్దమయ్యారు. ప్రజలకు చేరువయ్యేందుకు 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టేందుకు లోకేష్ సిద్దమయ్యారు. ''యువ గళం'' పేరు, లోకేష్ ఫోటోతో రూపొందించిన పాదయాత్ర లోగోను తాజాగా ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ లోగో కార్యక్రమంలో టిడిపి సీనియర్లు, కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. యువత జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా గళం వినిపించాలంటే 9686296862 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించారు. విచ్చలవిడిగా డ్రగ్స్, మహిళలపై అఘాయత్యాలు, నిరుద్యోగం ఇలా రాష్ట్రంలో యువతీయువకుల సమస్యలు తెలుసుకునేందుకే లోకేష్ ''యువ గళం'' పేరిట పాదయాత్ర చేపట్టారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.