
Highest Wicket Takers in IPL History: క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి రంగం సిద్ధమైంది. మార్చి 22న ప్రారంభమయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లు తలపడనున్నాయి. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. అయితే, ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్-10 బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
10. రవీంద్ర జడేజా
భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటివరకు 160 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్-10 లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో జడేజా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.
9. జస్ప్రీత్ బుమ్రా
ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా కొనసాగుతున్న భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు బుమ్రా ఐపీఎల్ లో 165 వికెట్లు తీసుకుని ఈ లిస్టులో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.
8. లసిత్ మలింగా
యార్కర్ల కింగ్, శ్రీలంక లెజెండరీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా ఐపీఎల్ లో 170 వికెట్లు సాధించాడు. 2008లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మలింగ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ముంబైకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.
7. అమిత్ మిశ్రా
భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్ లో 174 వికెట్లు తీసుకున్నాడు. అతను ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, దక్కన్ ఛార్జెస్, లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఐఫీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న 7వ బౌలర్ గా ఉన్నాడు.
6. రవిచంద్రన్ అశ్విన్
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో 180 వికెట్లు తీసుకున్నాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పూణే, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ తరఫున ఆడాడు.
5. సునీల్ నరైన్
వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ 2012లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. ఆ జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆల్ రౌండర్ గా ఉన్న సునీల్ నరైన్ 180 వికెట్లతో ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా 5వ స్థానంలో ఉన్నాడు.
4. భువనేశ్వర్ కుమార్
భారత స్టార్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనదైన అద్భుతమైన బౌలింగ్ తో 181 వికెట్లతో ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు సాధించిన 4వ బౌలర్ గా కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్,పూణే వారియర్స్ తరఫున ఆడాడు. రాబోయే ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడనున్నాడు.
3. డ్వేన్ బ్రావో
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో 2008లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ అద్భుతమైన బౌలింగ్ తో ఐపీఎల్ లో 183 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన మూడో ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. డ్వేన్ బ్రావో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు.
2. పీయూష్ చావ్లా
భారత క్రికెటర్ పీయూష్ చావ్లా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా ఉన్నాడు. లెగ్ స్పిన్ తో అదరగొట్టే చావ్లా 2008లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు 192 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరఫున ఆడాడు.
1. యుజ్వేంద్ర చాహల్
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల లిస్టులో టాప్ లో ఉన్నాడు. 2013లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన చాహల్ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. మధ్య ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ తో తన జట్లకు అనేక విజయాలు అందించిన చాహల్ మొత్తం 205 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ లో డబుల్ సెంచరీ వికెట్లు సాధించిన ఒకేఒక్క బౌలర్ చాహల్.