బ్రహ్మజ్ఞానం

By telugu news teamFirst Published Mar 14, 2020, 12:47 PM IST
Highlights

అన్ని శరీరాలు పాంచభౌతిక నిర్మితములు అయినప్పుడు ఒకదానికి దూరంగా ఇంకొకటి వెళ్ళవలసిన అవసరం ఏమి వున్నది ? ఒకవేళ ఆత్మను దూరంగా వెళ్ళమని మీ అభిప్రాయం ఐతే ఆత్మను ఎలా దూరంగా పంపగలను ? దేని నుండి దూరంగా పంపాలి ?  అని ప్రశ్నల వర్షం గుప్పించాడు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

జగద్గురువులు ఆదిశంకరుల గురించి ఎప్పుడు మననం చేసుకున్నా వారికి చండాలుని రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై కొంత వాదన తరువాత బ్రహ్మజ్ఞానం ప్రసాదించడం అనే విషయం కూడా చదువుకుంటూనే ఉంటాము.ఒకప్పుడు ఆదిశంకరులు కాశీక్షేత్రంలో గంగానదిలో పవిత్ర స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి బయలు దేరగా అదే సమయానికి వారికి ఎదురుగా నాలుగు కుక్కలను ముందుపెట్టుకుని ఒక ఛండాలుడు ఎదురు అయ్యాడు. తనకు ఎక్కడ మైల సోకుతుందో అని శంకరులు కలతచెంది ఆ చండాలుని దూరంగా పొమ్మని గద్దించారు.అప్పుడు ఛండాలుడు ఏమాత్రం బెదరకుండా ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుతో

శ్లో. అన్నమయా దన్నమయ మథవా చైతన్యమేవ చైతన్యాత్ /
ద్విజవర ( యతివర ) దూరీ కర్తుమ్ వాంచ్ఛసి కిమ్ బ్రూహి గచ్ఛ గచ్ఛేతి...

ఓ యతీశ్వరుడా ! నీవు దేహము నుండి దేహమును దూరంగా వెళ్ళమంటున్నావా ? లేక చైతన్యము నుండి చైతన్యమును తొలగమంటున్నావా ? అన్ని శరీరాలు పాంచభౌతిక నిర్మితములు అయినప్పుడు ఒకదానికి దూరంగా ఇంకొకటి వెళ్ళవలసిన అవసరం ఏమి వున్నది ? ఒకవేళ ఆత్మను దూరంగా వెళ్ళమని మీ అభిప్రాయం ఐతే ఆత్మను ఎలా దూరంగా పంపగలను ? దేని నుండి దూరంగా పంపాలి ?  అని ప్రశ్నల వర్షం గుప్పించాడు. 

ఈ విధమైన జ్ఞాన సంబంధ వచనములు చండాలుని నోటి ద్వారా విన్న శంకరులు దిగ్భ్రమని చెంది తన తప్పిదమును గ్రహించి చండాలునికి శిరస్సు వంచి నమస్కరించారు. ఆశువుగా ఈ అయిదు శ్లోకాలు చెప్పారు. అవే ' మనీషా పంచకం ' గా ప్రసిద్ధికెక్కాయి. ఆశ్లోకాలలో ఆత్మదర్శి అయిన వాడు చండాలుడైనా, బ్రాహ్మణుడు అయినా అతడే నా గురువు అని చెప్పారు.

ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవలసింది ప్రతి చండాలుడూ తనకు గురువు అని శంకరులు చెప్పలేదు. ఆత్మదర్శి అయినవాడు ఏ జాతి వాడైనా తన గురువే అని చెప్పినట్లు అర్ధం చేసుకోవాలి. 

వెంటనే నాలుగు కుక్కలతో వున్న ఛండాలుడు అదృశ్యమయ్యాడు. నాలుగు వేదములతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదిశంకరులను ఆశీర్వదించి ప్రస్థాన త్రయం పై భాష్యములు వ్రాయమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. శివుని ఆజ్ఞ మేరకు ఆదిశంకరులు బదరికాశ్రమానికి వెళ్లి భాష్య రచనకు అంకురార్పణ చేసారు. 

అసలు ఏమిటి ఈ మనీషా పంచకం ? ఆదిశంకరులకు ఆ పార్వతీపతి పరమేశ్వరుడు శంకరుడు చండాలుని రూపంలో తత్వబోధ చేసిన తరువాత జగద్గురువులు చెప్పిన ఈ అయిదు శ్లోకములో ఏమివున్నది ? అనేజిజ్ఞాస మనకందరకూ కలుగుతూనే వుంటుంది. ఈ అయిదు శ్లోకములు కంఠతా పెట్టవలసినవి. భావము తెలుసుకోవలసినవి. ఉపదేశ వాక్యములుగా స్వీకరించి ఆచరణలో పెట్టవలసినవి.

ఎందరో గురువులు తమ జ్ఞాన యజ్ఞ పరంపరలో శిష్యులకు బోధించారు. వాటిని గౌరవిస్తూ మనం ముందుకు వెళదాం. భావము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భక్తి శ్రద్దలతో ఇందులో వున్న విషయములు గంభీరమైనవి. అందువలన మన మేధస్సుకు కొద్దిగా వత్తిడి పెట్టి ఈ లక్ష్యంలో కృతకృత్యులం కావాలని జగద్గురువు ఆదిశంకరులని ప్రార్ధిస్తూ ముందుకు అడుగు వేద్దాం.


శ్లో. జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్పుటతరా యా సంవిజృమ్భతే
యా బ్రహ్మాది పిపీలికాన్త తనుషు ప్రోతా జగత్సాక్షిణీ /
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్
చ౦డాలోస్తు స తు ద్విజోస్తు గురు : ఇత్యేషా మనీషా మమ // 1.

శ్లో. బ్రహ్మయివాహమిదం జగచ్ఛ సకలం చిన్మాత్ర విస్తారితం
సర్వం చైత ద విద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం /
ఇద్హం యస్య దృఢామతి : సుఖతరే నిత్యే పరే నిర్మలే
చ౦డాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ // 2 .

శ్లో. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచో గురో
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృ శతా నిర్వ్యాజ శాంతాత్మనా
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ // 3 .

శ్లో. తిర్యజ్ నరదేవతాభి రహమిత్యన్త : స్పుటాగృహ్యతే
యద్భాసా హృదయాక్ష దేహ విషయాభాన్తి స్వతో >చేతనా :
తాం భాస్యై : పిహితార్క మండల నిభామ్ స్ఫూర్తిమ్ సదా భావయ
న్యోగీ నిర్వృత మానసో హి గురురిత్యేషా మనీషామమ // 4 .

శ్లో. యత్ సౌఖ్యామ్బుధి లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నివృత :
యస్మిన్ నిత్య సుధామ్బుధౌ : గలిత ధీ బ్రహ్మయివ న బ్రహ్మవిద్
య : కశ్చిత్స సురేంద్ర వందిత పదౌ నూనం మనీషామమ // 5 .

ఏ ఆనంద సాగర కణలేశమును అనుభవించి  ఇంద్రాదులు ఆనందిస్తున్నారో  జ్ఞాని దేనిని ప్రశాంతంగా అనుభవిస్తునాడో ఏ శాశ్వత ఆనంద సాగరంలో అతని చిత్తము లయించి పోయిందో అతడు బ్రహ్మ వేత్తకాదు బ్రహ్మమే. అతని పాద పద్మములకు ఇంద్రుడు కూడా నమస్కరిస్తాడు. 

లౌకిక జీవన వ్యాపారముల నుండి దూరమై శ్శాశ్వత బ్రహ్మానంద సాగరం లో మునకలు వేసేవాడే జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు అయిన తరువాత జీవుడు వుండే స్థితిని ఆదిశంకరులు ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణించి మహత్తరమైన మనీషా పంచకాన్ని ముగిస్తున్నారు. 

మొదటి నాలుగుశ్లోకాలలో మహావాక్య చతుష్టయం గురించి చెప్పిన జగద్గురువులు ఈ శ్లోకంలో జ్ఞానియైన వాడు వుండే వైభవాన్ని ప్రస్తుతిస్తున్నారు. ఆత్మ ఆనంద స్థితిని సముద్రంతో పోల్చి అనంతమైనదనే భావన తీసుకువచ్చారు. సాగరం అనంతమైనది కదా !  అట్టిసాగరం లోని చిన్న బిందువునైనా అనుభవించినట్లైతే సుధా౦బుధిలో మునకలు వేసినట్లే అని మనకు విశ్వాసం కలిగిస్తున్నారు.

' బ్రహ్మ విద్ బ్రహ్మయి వ భవతి ' బ్రహ్మమును తెలియువాడు బ్రహ్మమే అగుచున్నాడు అనే ఉపనిషద్ వాక్యాన్ని అనుసరించి,  జ్ఞానము, బ్రహ్మము రెండు కావని విశదీకరించారు జగద్గురువులు. 

జంతు జన్మలో కర్మలకు కర్తృత్వ భావనలు వుండవు కనుక వాటికి పాప పుణ్యముల ప్రసక్తి వుండదు. కానీ మానవజన్మలో సంచిత ప్రారబ్ద ఆగామి కర్మలను అనుభవించ వలసిన పరిస్థితి వున్నది. వెనుకటి జన్మల వాసనలను వెంట బెట్టుకుని వచ్చి వాటిని అధిగమించి మోక్షసాధన చేయవలసిన అవసరం వున్నది.

మన శాస్త్రముల ప్రకారము వాసనలు :-

శరీరం / మనస్సు / బుద్ధి  /
దర్శించేవాడు / భావించేవాడు / విచారణ చేసేవాడు

విషయం  : - వస్తువులు / వుద్రేకములు / ఆలోచనలు.

వీటిని నియంత్రణ చేసుకుంటూ ధ్యానమార్గం ద్వారా వాసనలను నిర్మూలన చేసుకోవాలి.

ఇది మనీషాపంచకము చండాలుని యందును బ్రాహ్మణుని యందును ఏక వస్తు దర్శనం చేయవలెననే ఉజ్వలస్థితి.  మనుష్యులందరూ మనీషులై ( మహాత్ములు అయి ) మహర్షులై తరించాలనే అభిలాషతో ఆదిశంకరులు చండాలుని రూపంలో వున్న పరమేశ్వర దర్శనం చేసుకుని మనలను అనుగ్రహించిన జ్ఞాన ప్రసాదం. ఛండాలుడు శంకరులను జ్ఞానతత్వంతో ప్రశ్నించిన తరువాత అతనిలోని బ్రహ్మ భావం తెలుసుకుని శంకరులు చెప్పిన శ్లోక పంచకం ఇది.

మనకు భగవద్గీతలో జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అయిదవ అధ్యాయంలో 18 వ శ్లోకంలో ఇదే విషయము చెప్పారు.

శ్లో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినీ /
శుని చైవ స్వపాకే చ పండితా : సమదర్శన : //

జ్ఞాన సంపన్నుడైన పండితుడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును గోవు, ఏనుగు, కుక్క మొదలైన వాని యందును ఛండాలుని యందునూ సమదృష్టితోనే వుండును. అనగా చైతన్యము గల ప్రతి దానిలో పరమాత్మను చూడడమనే అర్ధం చేసుకోవాలి, వారిని చూసినపుడు ఏహ్యభావం కలుగకుండా పరమాత్మ భావంతో వుండమని అర్ధం.

click me!