ముందు నుంచి చదివితే రాముడు, వెనక నుంచి చదివితే కృష్ణుడు.. ఇది మనకు మాత్రమే సాధ్యం

By ramya SridharFirst Published Aug 29, 2024, 3:03 PM IST
Highlights

పద్యాలు, పాటలు చాలా మంది రాసే ఉంటారు. కానీ.. ఒక పద్యం చదివినప్పుడు రాముడు.. ఆ పద్యాన్ని రివర్స్ లో చదవినప్పుడు కృష్ణుడు ని కీర్తిస్తున్నట్లు వచ్చే పద్యం ఎప్పుడైనా విన్నారా..? ఇప్పుడు చదవండి.  మన తెలుగు వారికి మాత్రమే సాధ్యమైంది ఇది.

అనులోమ విలోమ కావ్యం
శ్రీ రాఘవ యాదవ్యం అనే కావ్యం లో రామ కథ, కృష్ణ కథ ఒకేసారి వస్తాయి. దీనిని అనులోమ విలోమ కావ్యం అంటారు.

అందులోంచి ఒక పద్యం .... 

Latest Videos

వందేహం దేవం తం శ్రీతం
రంతారం కాలం భాసాయః
రామో రామాధీరాప్యాగో
లీలామారాయోధ్య వాసే

దీని అర్థం : సీత కొరకు పరితపించుచూ సహ్యాద్రి పర్వతములు దాటి, రావణుని చంపి, సీతతో అయోధ్యలో చాలాకాలము నివసించెనో, ఆ రామునికి నా నమస్సులు . 

ఇప్పుడు ఇదే పద్యాన్ని తిరగ వేసి రాస్తే: 

సేవాధ్యేయో రామాలాలీ
గోప్యారాధీ మారామోరాః
యసాభాలంకారం తారం
తం శ్రీతం వందేహం దేవం

దీని అర్ధం : వక్షస్థలి లక్ష్మీ వాసమై, యజ్ఞ పూజాదులతో స్మరించ యుక్తుడో, రుక్మిణి మున్నగు భార్యలతో సరసమాడునో, గోపికలచే వందించ బడునో, నగలతో విరాజితుడై ఉండునో, అట్టి శ్రీ కృష్ణునకి నా నమస్సులు.

రామకృష్ణారావు గారి బ్లాగ్ నుంచీ సేకరణ 

అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరనార్యుడు రచించిన ఒక పద్యం.... పద్యంలో ప్రారంభం నుండి చివరి దాకా చదివితే తెలుగు పద్యమై తెలుగు పదాల పొందిక గలిగి తెలుగు లో అర్థ స్ఫూర్తి కలిగిస్తుంది.
మరి అదే పద్యాన్ని చివరి పాదంలో చివరి అక్షరం నుండి మొదటి పాదంలో మొదటి అక్షరం దాకా { వెనుకనుండి ముందుకు } చదివితే అత్యంత ఆశ్చర్య జనకంగా సంస్కృతపద భూయిష్ఠమై చక్కని భావ స్ఫూర్తిని కలిగిస్తుంది. వింతగా వుంది కదూ? ఐతే ఆ పద్యమేమిటో చూద్దామా?

కందము:-
తా వినువారికి సరవిగ
భావనతో నానునతివిభావిసు తెజా
దేవర గౌరవ మహిమన
మావలసిన కవిత మరిగి మాకునధీశా.

ముందుగా తెలుగులో చూద్దాం.

ప్రతిపదార్థము:-
అతి విభావిసు తేజా = మిక్కిలి ప్రకాశించు పరాక్రమము కల
అధీశా = ఓ మహారాజా!
దేవర గౌరవ మహిమన = మీ ఘనత యొక్క మహిమ చేతనే
మా వలసిన కవిత = మా ప్రియమైన కవిత్వము
తాన్ = అది
వినువారికి సరవిగన్ = వినెడి వారికి యుక్తముగా
భావనతోన్ = భావించుటతో { ఆలకించు వారు సముచితముగా నున్నదని తలచినట్లు }
మాకు మరిగి = మాకు అలవడి { మరుగు రూపాంతరము మరిగి }
ఆనున్ = కనిపించును

భావము:-
మిక్కిలి ప్రకాశించు పరాక్రమము గల ఓ మహారాజా! మీ ఘనత యొక్క మహిమ చేతనే మా ప్రియమైన కవిత్వము ఆలకించువారు అది యుక్తముగా భావించుటతో మాకు అలవడి వ్యక్తమగుచున్నది.
{ఓరాజా! మేమాశ్రయించిన మీ మహత్వము వలననే శ్రోతల కానందకరమైన కవిత్వము మా కబ్బినది.అని భావము.}

అదే పద్యాన్ని తలక్రిందుగా వ్రాసి చూస్తే ..
సంస్కృతం లో పద చ్ఛేదము:-
శాధి - ఇన - కుం - ఆగిరి - మత - వికనసి - లవమాన - మహిమవరగౌరవదే - జాతే - సువిభౌ - ఇతి - నను - నా - అతః - నవభాః - గవి - రసకిరి - వా - అనువితా.
అన్వయ క్రమము:-
ఇన - ఆగిరి - కుం - శాధి - మత - వికనసి - లవమాన - నను - మహిమవరగౌరవదే - సువిభౌ - ఇతి - జాతే - నా - అతః - నవభాః - రసకిరి - గవి - అనువితా వా.

ప్రతిపదార్థము:-
ఇన =ఓ రాజా!
ఆగిరి = పర్వతములున్నంత కాలము
కుం = భూమిని
శాధి = శాసింపుము
మత = సర్వ సమ్మతుడా!
వికనసి = మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లుచున్నావు.
లవమాన = లవుని యొక్క మానము వంటి మానము కలిగిన
నను = ఓ భూవరా!
మహిమవరగౌరవదే = గొప్పతనముచే శ్రేష్ఠమైన గౌరవమునిచ్చునట్టి
సువిభౌ = నీ వంటి మంచి రాజు
ఇతి = ఈ విధముగా
జాతే = కలిగి యుండగా
నా = పండితుడైన, మనుష్యుడు
అతః = ఇట్టి గౌరవము వల్ల
నవభాః = క్రొత్త వికాసముగలవాడై
రసకిరి = రసము చిమ్మునట్టి
గవి = భాషయందు
అనువితా వా = స్తుతింపనివాడగునా! { తప్పక నుతించువాడగునని యర్థము. }

భావము:-
-ఓ రాజా పర్వతములున్నంత కాలము భూమిని శాసింపుము. సర్వ సమ్మతుడా! మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లు చున్నావు. లవుని యొక్క మానము వంటి మానము కలిగిన ఓ భూ వరా! గొప్పతనముచే శ్రేష్ఠమైనట్టి నీ వంటి మంచి రాజు యీ విధముగా కలిగి యుండగా పండితుడైన మనుష్యుడు ఇట్టి గౌరవము వల్ల క్రొత్త వికాసము కలవాడై రసము చిమ్మునట్టి భాష యందు స్తుతింపనివాడగునా. స్తుతింపబడును.
చూచారు కదా! ఎంత అద్భుతంగా వుందో.
మన సాహిత్యంలో వున్న చిత్ర విచిత్ర కవిత్వాలను గూర్చి తెలుసుకోవాలంటే బహుశా మన జీవితం చాలదేమో
 

click me!