నదుల్లో డబ్బులు వేయడం మంచిదా? కాదా?

By Naga Surya Phani Kumar  |  First Published Sep 28, 2024, 12:30 PM IST

నదులు, ఆలయాల్లోని కోనేరుల్లో డబ్బులు(coins) వేసి దండం పెట్టుకోవడం చాలా మంది చేస్తుంటారు. మీరు కూడా ఇలా కాయిన్స్ వేసి ఉంటారు కదా. అసలు ఇలా నీళ్లలో డబ్బులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? అసలు అలా డబ్బులు వేయడం మంచిదేనా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 
 


నదుల్లో డబ్బులు వేయడం భారతదేశంలో ఒక పురాతన ఆచారం. ఈ ఆచారం వేదకాలం నుండి ఉన్నట్టుగా చరిత్ర  చెబుతోంది. ప్రధానంగా ఈ ఆచారానికి ధార్మిక, సాంస్కృతిక రీజన్స్ ఉన్నాయి. కాలానుగుణంగా మార్పులు వచ్చినప్పటికీ ఈ ఆచారం మాత్రం కొనసాగుతోంది. ఇలా నదులు, చెరువుల్లో డబ్బులు వేయడం వల్ల కలిగే మార్పుల గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

పురాణాల ప్రకారం..

మన పురాణాల ప్రకారం నదులు చాలా పవిత్రమైనవి. ముఖ్యంగా గంగ, యమున, గోదావరి వంటి నదులను దేవతల రూపంగా భావిస్తారు. అందువల్ల భక్తులు నదుల్లోకి నాణేలు వేయడం అనేది దేవతలకు కానుకలు ఇచ్చినట్టుగా భావిస్తారు.  ఈ ప్రక్రియను ఒక ఆచారంగా అందరూ ఆచరిస్తారు. 

సైన్స్ ఏం చెబుతోందంటే..

Latest Videos

undefined

పూర్వం నాణేలు ముఖ్యమైన లోహాలతో తయారు చేసేవారు. ముఖ్యంగా రాగి(copper)తో ఎక్కువ వీటిని తయారు చేసేవారు. ఈ నాణేలు నీటిలోకి వెళ్లి అక్కడ ఉండే సూక్ష్మజీవులు, ఇతర హానికరమైన పదార్థాలను నాశనం చేస్తాయి. సైన్స్ ప్రకారం రాగి, వాటర్ తో కలిసినప్పుడు రసాయన చర్య జరిగి నీటిలోని వ్యర్థాలను సెపరేట్ చేసి నీటి అడుగుకు పంపుతుంది. దీంతో పైన ప్రవహిస్తున్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటినే పూర్వం ప్రజలంతా తాగేవారు. ఇది ఒక రకమైన పరిశుభ్రతను ప్రోత్సహించే ప్రక్రియ కాబట్టి నాణేలు నదుల్లో వేయడం నీరు శుభ్రమవుతుందని, ఒక ఆరోగ్యకరమైన ఆచారమని ప్రజలంతా ఆచరించేవారు.  

దానం.. ఆచారం 

పురాతన కాలంలో నదులు, చెరువులు వంటి జలవనరులకు పూజలు చేసేవారు. తమ ధనాన్ని జల దేవతలకు ఇవ్వడం వల్ల పుణ్యం వస్తుందని నమ్మేవారు. నదిలో డబ్బులు వేయడం ద్వారా నీటి దేవతలు మనకు మంచి ఫలితాలను అనుగ్రహిస్తాయని ఒక ఆధ్యాత్మిక నమ్మకం కూడా ఉంది. 

కాలం మారింది.. డబ్బులు కూడా మారాయి 

ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నదుల్లో డబ్బులు వేయడం కొనసాగుతోంది. జల దేవత అయిన అమ్మవారికి ఇచ్చామనుకొని చిల్లర డబ్బులకు బదులు కొందరు నోట్లు కూడా వేస్తుంటారు. దీనికి తోడు ఈ కాలంలో నదుల్లో వేస్తున్న కాయిన్స్ ఇనుముతో చేస్తున్నారు. ఇనుము నీటితో కలిస్తే తుప్పు పట్టి ఆ నీరంతా పాడవుతోంది. ఆ నీటిలో నివసించే చేపలు, కప్పలు, పాములు ఇలా వివిధ రకాల జీవులు కలుషితమైన నీటిలో బతకలేక వేరే చోటికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నాయి. 

ఆచారం.. మూఢాచారంగా..

పాత నాణేలు రాగి, వెండి, బంగారంతో తయారుచేసేవారు వీటిని నీటిలో వేయడం వల్ల నీరు పరిశుభ్రమవుతుంది. వాటిలో ఉండే ధాతువుల ప్రాముఖ్యత తెలియక చాలా మంది డబ్బులు వేయాలనుకుంటున్నారు. దీంతో ఇప్పటికీ కొందరు  ప్రస్తుత కాయిన్స్, కాగితాలు(డబ్బు), ఇతర పదార్థాలు వేస్తుంటారు. దీని వల్ల ఆ నీరు మరింత కలుషితమవుతోంది. ఇది ఆచారం కాస్త మూఢాచారంగా మారింది. 

పర్యావరణానికి హాని

ఇప్పటి పరిస్థితుల్లో ఈ ఆచారం ఒక ఇబ్బందికరమైన సమస్యగా మారింది. నదులు, సరస్సులు, చెరువుల్లో వేసే డబ్బులు, ఇతర వస్తువులు నీటిని కలుషితం చేస్తున్నాయి. ఇది పర్యావరణానికి హాని కలిగించే ఆచారంగా మారింది. నదుల్లో డబ్బులు వేయడం ఒక పాతకాలపు ఆచారం. దీని వెనుక ఉన్న కారకాలు ధార్మిక, సాంస్కృతికంగా, శాస్త్రీయంగా ఉన్నాయి. సమకాలీన సమాజంలో దీన్ని కొనసాగించడం వల్ల పర్యావరణ సమస్యలు పరిష్కారం అవుతాయి.

పూజా సామగ్రి కూడా నీటిలోనే..

పూర్వం రాగి, వెండి, బంగారు నాణేలు వేయడం వల్ల నీరు శుభ్రమయ్యేది. ఇటీవల చాలా మంది వారి ఇళ్లలో పూజ చేసిన పువ్వులు, పసుపు, కుంకుమ వంటి వాటిని కూడా నీటిలో కలిపేస్తున్నారు. అవి కెమికల్స్ తో తయారు చేసినవి కావడంతో నీటిలో కలిసి కెమికల్ రియాక్షన్ జరుగుతోంది. దీంతో నీటిలో నివసించే జీవాల ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. సముద్రాలు, నదుల్లో ఉండే చేపలు, ఇతర ప్రాణులు ప్లాస్టిక్ వ్యర్థాలను మింగి ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని చేపలను కట్ చేసినప్పుడు వాటి కడుపులో ప్లాస్టిక్ కవర్లు బయటపడుతున్నాయని ఫిషర్ మెన్ చెబుతున్నారు. ఈ చర్యలు పర్యావరణానికి ప్రమాదమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అందువల్ల మారిన కాలానికి అనుగుణంగా మనం ఇప్పుడు వాడుతున్న డబ్బులు నీటిలో వేయడం మంచిది కాదు. ఆ డబ్బుతో ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే సమాజానికి, హిందూ ధర్మానికి మంచిది.  
 

click me!