కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలేంటీ వక్ఫ్ సవరణ బిల్లు.? దీని చరిత్ర ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
2024 ఆగస్టు 8న లోక్‌సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టారు. అవి వక్ఫ్ (సవరణ) బిల్లు 2024, ముస్లిమ్ వక్ఫ్ (రద్దు) బిల్లు 2024. ఈ బిల్లుల ఉద్దేశం వక్ఫ్ బోర్డుల పనితీరును మెరుగుపరచడం, వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడం. ఈ మార్పులతో వక్ఫ్ బోర్డు పనితీరులో పారదర్శకత పెరుగుతుందని, ఆస్తుల పరిరక్షణ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
వక్ఫ్ (సవరణ) బిల్లు 2024 ఉద్దేశం వక్ఫ్ చట్టం, 1995లో మార్పులు చేసి, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించడం. ఈ బిల్లు ద్వారా భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల పరిపాలన, నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
* వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడం.
* పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడం.
* వక్ఫ్ బోర్డుల పనితీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు సహాయపడుతుంది.
* గత చట్టంలో ఉన్న లోపాలను సవరించి, వక్ఫ్ బోర్డుల పనితీరును మెరుగుపర్చడం కోసం కొన్ని కీలక మార్పులు చేయడం (ఉదాహరణకు చట్టానికి కొత్త పేరు పెట్టడం).
* వక్ఫ్ అనే పదానికి నూతన నిర్వచనం అందించడం.
* వక్ఫ్ ఆస్తుల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయడం.
* వక్ఫ్ రికార్డుల నిర్వహణలో టెక్నాలజీ ఉపయోగాన్ని పెంచడం.
వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు, జవాబులు:
1) భారతదేశంలో వక్ఫ్ నిర్వహణకు బాధ్యత వహించే సంస్థలు ఏమిటి? వాటి పాత్ర ఏమిటి?
భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ వక్ఫ్ చట్టం, 1995 ఆధారంగా జరుగుతోంది. దీనిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రధానంగా ఈ మూడు సంస్థలు వక్ఫ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి:
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ (CWC) – ప్రభుత్వం, రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు విధానపరమైన సూచనలు ఇస్తుంది. అయితే ఇది వక్ఫ్ ఆస్తుల ప్రత్యక్ష నిర్వహణ చేయదు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డులు (SWBs) – ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడం, నిర్వహించడం, నిర్వహణలో తలెత్తే సమస్యలను పరిష్కరించడం వీటి పని.
వక్ఫ్ ట్రిబ్యునల్స్ – వక్ఫ్ ఆస్తులతో సంబంధమైన వివాదాలను పరిష్కరించే ప్రత్యేక న్యాయస్థానాలు.
ఈ వ్యవస్థ వల్ల వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మెరుగుపడుతుంది, సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల్లో జరిగిన చట్టపరమైన మార్పుల ద్వారా పారదర్శకత, సమర్థత, బాధ్యతాయుత విధానం పెరిగింది.
a. వక్ఫ్ ఆస్తుల మార్పు అసాధ్యం
"ఒకసారి వక్ఫ్ అయితే, ఎప్పటికీ వక్ఫ్" అనే సిద్ధాంతం వివాదాలకు దారితీసింది. బేట్ ద్వారక దీవులపై హక్కులు ఎవరికో అన్న అంశం కోర్టులను కూడా అప్రమత్తం చేసింది.
b. చట్టపరమైన వివాదాలు, నిర్వహణలో లోపాలు
వక్ఫ్ చట్టం, 1995, 2013 సవరణ వల్ల అనేక సమస్యలు కొనసాగుతున్నాయి, వాటిలో ముఖ్యమైనవి: అక్రమ ఆక్రమణలు, అస్తవ్యస్తమైన నిర్వహణ, యజమాన్యంపై వివాదాలు, ఆస్తుల నమోదు, సర్వే లలో జాప్యం, పెద్ద ఎత్తున న్యాయపరమైన కేసులు, మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు.
c. న్యాయపరమైన పర్యవేక్షణ లేకపోవడం
వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాలను ఉన్నత కోర్టుల్లో విచారణకు పెట్టలేరు.
దీని వల్ల పారదర్శకత తగ్గి, బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోతున్నారు.
d. వక్ఫ్ ఆస్తుల పూర్తి సర్వే లేకపోవడం:
సర్వే కమిషనర్ల పనితీరు మెరుగుగా లేకపోవడం వల్ల ఆలస్యం. గుజరాత్, ఉత్తరాఖండ్‌లో సర్వేలు ప్రారంభించలేదు. ఉత్తరప్రదేశ్‌లో 2014లో ఆదేశించిన సర్వే ఇప్పటికీ పూర్తి కాలేదు. రెవెన్యూ శాఖతో సరైన సమన్వయం లేకపోవడం కూడా ప్రధాన కారణం.
e. వక్ఫ్ చట్ట దుర్వినియోగం:
కొన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి సామాజిక కలహాలకు దారి తీశాయి. వక్ఫ్ చట్టంలోని 40వ విభాగాన్ని ఉపయోగించి, కొన్ని వ్యక్తిగత భూములను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారు. 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో, 8 రాష్ట్రాలు మాత్రమే తమ డేటా అందించగా, 515 ప్రైవేట్ ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా గుర్తించినట్లు తేలింది.
f. వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతపై సందేహాలు:
ఈ చట్టం కేవలం ఒకే మతానికి వర్తిస్తుంది, ఇతర మతాలకు ఇలాంటి చట్టాలు లేవు. దీని రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
1) వక్ఫ్ బిల్లు 2024కి ముందు చేపట్టిన సంప్రదింపులు
అల్పసంఖ్యాక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. ముఖ్యంగా:
సచార్ కమిటీ నివేదిక
ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు
మీడియా, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు – వక్ఫ్ చట్టం దుర్వినియోగం, అధికారం దుర్వినియోగం, వక్ఫ్ ఆస్తుల సద్వినియోగం జరగకపోవడం.
రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు.
2) చట్టాన్ని సమీక్షించే ప్రక్రియ
వక్ఫ్ చట్టం, 1995 సవరణ కోసం మంత్రిత్వ శాఖ సమీక్ష చేపట్టింది.
రెండు ప్రధాన సమావేశాలు నిర్వహించారు:
24.07.2023 – లక్నో
20.07.2023 – న్యూఢిల్లీలో
ఇందులో వక్ఫ్ నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యలు చర్చించగా, చట్టాన్ని సవరించాలని అంగీకారం కుదిరింది.
3) చర్చించిన కీలక అంశాలు:
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ (CWC), రాష్ట్ర వక్ఫ్ బోర్డుల (SWB) పరిధిని విస్తరించడం.
ముతవల్లీల (వక్ఫ్ ఆస్తుల నిర్వాహకులు) బాధ్యతలు & పాత్రలు స్పష్టత.
వక్ఫ్ ట్రిబ్యునల్స్ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం
ఆస్తుల నమోదును మెరుగుపరచడం
వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కుల స్పష్టత (డిక్లరేషన్ ఆఫ్ టైటిల్స్)
వక్ఫ్ ఆస్తుల సర్వేను వేగంగా & సమగ్రంగా చేయడం
వక్ఫ్ ఆస్తుల నామమాత్రపు యాజమాన్య మార్పులను నియంత్రించడం
ముతవల్లీల ఖాతాలను సమర్థంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలు రూపొందించడం
వార్షిక ఖాతాల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడం
ఎవాక్యూ ఆస్తుల (భారతదేశాన్ని విడిచిపోయిన వారి ఆస్తులు) & పరిమితి చట్టానికి సంబంధించిన నిబంధనలను సమీక్షించడం
విజ్ఞానపూర్వకంగా వక్ఫ్ ఆస్తులను నిర్వహించేందుకు ప్రత్యేక విధానం రూపొందించడం
4) అంతర్జాతీయ ప్రమాణాల పరిశీలన:
మంత్రిత్వ శాఖ ఇతర దేశాల్లో వక్ఫ్ నిర్వహణపై అధ్యయనం చేసింది.
సౌదీ అరేబియా, ఈజిప్ట్, కువైట్, ఒమన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ వంటి దేశాల్లో ప్రభుత్వ నియంత్రిత చట్టాలు & సంస్థలు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో కీలకంగా ఉన్నాయని గుర్తించింది.
1) బిల్లు ప్రవేశపెట్టిన తేదీ:
2024 ఆగస్టు 8: వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో లోపాలను సరిదిద్దేందుకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
2024 ఆగస్టు 9: లోక్‌సభ, రాజ్యసభలు ఈ బిల్లును ఉమ్మడి పార్లమెంటరీ కమిటీకి (Joint Committee) పంపించాయి. ఈ కమిటీ 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటు చేశారు.
2) బిల్లుపై ప్రజాభిప్రాయాలు & నిపుణుల సంప్రదింపులు:
బిల్లులోని అంశాలపై ప్రజల, నిపుణుల, సంబంధిత సంస్థల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఉమ్మడి కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కమిటీ 36 సార్లు సమావేశమైంది, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, నిపుణులు, వక్ఫ్ బోర్డులు, ఇతర ప్రముఖ వ్యక్తుల అభిప్రాయాలను స్వీకరించింది.
సమావేశాలకు హాజరైన సంస్థలు & వ్యక్తులు:
* ఆల్ ఇండియా సున్నీ జమియతుల్ ఉల్మా, ముంబై
* ఆల్ ఇండియా ముస్లింస్ ఆఫ్ సివిల్ రైట్స్ (IMCR), న్యూ ఢిల్లీ.
* జకాత్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా
* ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ఢిల్లీ
* దారుల్ ఉలుమ్ బీబాండ్
* ముస్లిం ఉమెన్ ఇంటలెక్చువల్ గ్రూప్ - డాక్టర్ షాలిని అలీ
ఇంకా ఇతర మతపరమైన & న్యాయ నిపుణుల సంస్థలు.
97,27,772 మంది ప్రజలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా & డిజిటల్ ద్వారా పంపించారు.
3) వివిధ నగరాల్లో అధ్యయన పర్యటనలు:
వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, కమిటీ 10 నగరాల్లో పరిశీలన పర్యటనలు చేపట్టింది:
2024 సెప్టెంబర్ 26 – అక్టోబర్ 1 → ముంబై, అహ్మదాబాద్, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు
2024 నవంబర్ 9 – 11 → గువహటి, భువనేశ్వర్
2025 జనవరి 18 – 21 → పట్నా, కోల్‌కతా, లక్నో
ఈ పర్యటనల్లో 25 రాష్ట్ర వక్ఫ్ బోర్డుల (7 – ఢిల్లీలో, 18 – వివిధ నగరాల్లో) సమస్యలు, లీగల్ ఇబ్బందులపై చర్చలు జరిగాయి.
4) బిల్లుపై తుది నిర్ణయం & పార్లమెంటుకు సమర్పణ
2025 జనవరి 27: కమిటీ ప్రతి సెక్షన్‌ను పరిశీలించి, మార్పులకు ఓటింగ్ నిర్వహించి, మెజారిటీతో ఆమోదించింది.
2025 జనవరి 29: తుది నివేదిక (Final Report) తయారు చేసి, అధ్యక్షుడి అనుమతితో సమర్పించారు.
2025 జనవరి 31: లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక అందజేశారు.
2025 ఫిబ్రవరి 13: ఈ నివేదికను లోక్‌సభ, రాజ్యసభల్లో ఉంచారు.
వక్ఫ్ సవరణ బిల్లు 2024 ప్రధానంగా పరిపాలనా సమర్థత, పారదర్శకత, బాధ్యతాయుతమైన నిర్వహణ లక్ష్యంగా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా టెక్నాలజీ ఆధారిత, చట్టపరంగా బలమైన వ్యవస్థను నిర్మించడంతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది.
1) ఏకీకృత వక్ఫ్ నిర్వహణ
వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ఈ మార్పులు తీసుకొస్తారు:
* అసంపూర్తిగా ఉన్న వక్ఫ్ ఆస్తుల సర్వేను పూర్తి చేయడం.
* వక్ఫ్ ట్రిబ్యునల్, బోర్డుల వద్ద పెండింగ్ ఉన్న కేసుల సంఖ్య తగ్గించడం.
* ముతవల్లీల (Waqf caretakers) ఖాతాలు, ఆడిట్, పర్యవేక్షణ వ్యవస్థ మెరుగుపరచడం.
* వక్ఫ్ ఆస్తుల హక్కుల నమోదు (Mutation) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం.
2) కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారాలను పెంచడం
నిర్ణయలో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం:
ఇస్లాం మతానికి చెందిన ఇతర వర్గాలు, ఇతర మతస్తులు, వెనుకబడిన తరగతులు, మహిళలకు ప్రాధాన్యత.
నిర్వహణా సమర్థతను మెరుగుపరచడం:
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ (CWC) & రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు మరింత అధికారాలు ఇచ్చి, సమర్థవంతమైన పాలనకు వీలు కల్పించడం.
3) రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పనితీరును మెరుగుపరచడం:
డిజిటల్ పోర్టల్ & డేటాబేస్ వ్యవస్థ:
వక్ఫ్ నమోదు, సర్వే, హక్కుల బదిలీ (mutation), ఆడిటింగ్, లీజింగ్ & లిటిగేషన్ పనులను ఆటోమేటెడ్ డిజిటల్ వ్యవస్థలోకి మార్చడం. పారదర్శకత & సమర్థత పెంచడం.
4) వక్ఫ్ ఆస్తుల అభివృద్ధి (Development of Auqaf)
పోర్టల్ ఆధారిత నిర్వాహణ:
వక్ఫ్ ఆస్తుల నిర్వహణను గణనీయంగా మెరుగుపరిచేలా ఒక లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టడం.
* సెక్షన్ 65: వక్ఫ్ బోర్డులు నిర్వహణ & ఆదాయ పెంపుపై ఆరు నెలలలోపు నివేదిక అందించాలి, తద్వారా తక్షణ చర్యలు తీసుకోవచ్చు.
* సెక్షన్ 32(4): వక్ఫ్ భూములను విద్యాసంస్థలు, షాపింగ్ సెంటర్లు, మార్కెట్లు, గృహ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయడానికి బోర్డులకు అధికారం ఇవ్వడం. అవసరమైతే ముతవల్లీల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం వక్ఫ్ బోర్డులకు ఇవ్వడం. ఈ మార్పులతో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరింత సమర్థంగా, పారదర్శకంగా, సమాజ హితంగా మారనుంది.
వక్ఫ్ సవరణ బిల్లు 2024 – సంయుక్త కమిటీ సిఫార్సులు:
జాయింట్ కమిటీ ఆన్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2024 (JCWAB) కొన్ని కీలక సంస్కరణలను సిఫార్సు చేసింది. ఇవి వక్ఫ్ నిర్వహణను ఆధునికతరం చేయడంతో పాటు, సమర్థత, పారదర్శకత, సమాజహిత విధానాలను మెరుగుపరిచేలా రూపొందించారు.
1) ట్రస్టులను వక్ఫ్ నుండి వేరు చేయడం:
* ముస్లింలు రూపొందించిన ట్రస్టులు ఇకపై వక్ఫ్ కింద లెక్కించరు.
* ట్రస్టుల నిర్వహణపై పూర్తి నియంత్రణ ట్రస్టీలకే ఉంటుందనే స్పష్టత.
2) టెక్నాలజీ & కేంద్ర పోర్టల్ వినియోగం
* వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం డిజిటల్ సెంట్రల్ పోర్టల్ ఏర్పాటు.
* నమోదు, ఆడిట్, విరాళాలు, లిటిగేషన్ వంటి ప్రక్రియలను ఆటోమేటెడ్ విధానం ద్వారా నిర్వహించడం.
3) వక్ఫ్ ఆస్తుల అంకిత సమర్థత (Eligibility for Waqf Dedication)
* ఒక ఆస్తిని వక్ఫ్‌గా అంకితం చేయాలంటే, సంబంధిత వ్యక్తి కనీసం 5 సంవత్సరాల నుంచి ముస్లిం ఆచారాలను పాటించి ఉండాలి.
* 2013కి ముందు ఉన్న నిబంధనలను తిరిగి తీసుకురావడం.
4) ‘వక్ఫ్ బై యూజ్’ ఆస్తుల రక్షణ
* ఇప్పటికే వక్ఫ్‌గా నమోదైన ఆస్తులు, ప్రభుత్వ భూమిగా గుర్తించకపోతే, వక్ఫ్ ఆస్తులుగానే కొనసాగుతాయి.
5) కుటుంబ వక్ఫ్‌లో మహిళల హక్కులు:
* ఒక ఆస్తిని వక్ఫ్‌గా అంకితం చేసేముందు, మహిళలకు వారసత్వ హక్కులను పూర్తిగా అమలు చేయడం తప్పనిసరి.
* విదవలు, విడాకులు పొందిన మహిళలు, అనాధలకు ప్రత్యేక రక్షణ.
6) పారదర్శక వక్ఫ్ నిర్వహణ:
* ముతవల్లీలు తమ ఆస్తుల వివరాలను 6 నెలల్లోగా కేంద్ర పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి.
* ఇది అక్రమాల్లో మోసాలను తగ్గిస్తుంది.
7) ప్రభుత్వ భూములు & వక్ఫ్ వివాదాలు
* వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ భూములను వక్ఫ్‌గా ప్రకటించడాన్ని అరికట్టడం.
* జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి లేదా అంతకన్నా పై స్థాయి అధికారి విచారణ నిర్వహించాలి.
8) వక్ఫ్ ట్రిబ్యునళ్ల (Waqf Tribunals) బలోపేతం
* ట్రిబ్యునల్ సభ్యుల ఎంపిక & పదవీకాలం ఫిక్స్ చేయడం.
* వివాదాల పరిష్కారం వేగవంతం చేయడం.
9) రాష్ట్ర & కేంద్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర ప్రాతినిధ్యం
* కేంద్ర & రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో 2 మంది ముస్లిమేతర సభ్యులను చేర్చడం.
* ఇది అంతర్గత పారదర్శకతను పెంచుతుంది.
10) వార్షిక విరాళాల (Annual Contributions) తగ్గింపు
* వక్ఫ్ సంస్థలు బోర్డుకు చెల్లించాల్సిన వసూళ్ల శాతం 7% నుంచి 5% కు తగ్గింపు.
* అది ఎక్కువగా మదర్సాలు, అనాధాశ్రమాలు & ఇతర సామాజిక కార్యక్రమాలకు వినియోగించేందుకు వీలుగా మారుస్తుంది.
11) పరిమితి చట్టం (Limitation Act) అన్వయింపు
* వక్ఫ్ ఆస్తులపై కేసులకు 1963 పరిమితి చట్టం వర్తింపజేయడం.
* ఇది నిరంతరం కొనసాగుతున్న కేసులను తగ్గించి, త్వరితగతిన పరిష్కారాలు సాధించేందుకు ఉపయోగపడుతుంది.
12) వార్షిక ఆడిట్ సంస్కరణలు
* రూ. 1 లక్షకు పైగా ఆదాయమున్న వక్ఫ్ సంస్థలకు తప్పనిసరిగా ప్రభుత్వ నియమిత ఆడిటర్లతో ఆడిట్ చేయించాలి.
13) ఆస్తుల అక్రమ క్లెయిమ్‌లను అడ్డుకోవడం
* వక్ఫ్ బోర్డులు తమకు సంబంధం లేని ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడాన్ని నివారించేందుకు సెక్షన్ 40ను తొలగించడం.
* పల్లెలు, పట్టణాలు మొత్తం వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడాన్ని అరికట్టడం.
ఈ సంస్కరణలు వక్ఫ్ నిర్వహణను పారదర్శకంగా, సమర్థంగా & సమాజ ప్రయోజనకరంగా మార్చేలా రూపొందించారు.
సెప్టెంబర్ 2024 నాటికి, 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డుల నుంచి లభించిన సమాచారం ప్రకారం, 5,973 ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్‌గా ప్రకటించారు. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు:
1) ఢిల్లీ
సెప్టెంబర్ 2024 నాటికి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) తెలిపిన వివరాల ప్రకారం:
* 108 ఆస్తులు ల్యాండ్ & డెవలప్‌మెంట్ ఆఫీస్ నియంత్రణలో ఉన్నాయి.
* 130 ఆస్తులు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ఆధీనంలో ఉన్నాయి.
* 123 పబ్లిక్ ప్రాపర్టీలు వక్ఫ్‌గా ప్రకటించబడి, న్యాయపరమైన వివాదాల్లో ఉన్నాయి.
2) కర్ణాటక
* 1975 & 2020లో: 40 వక్ఫ్ ఆస్తులుగా నోటిఫై చేయబడ్డాయి, వీటిలో...
వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు, సమాధుల ప్రదేశాలు, చెరువులు, ఆలయ స్థలాలు & ప్రజలకు చెందిన ప్రదేశాలు ఉన్నాయి.
3) పంజాబ్
* పటియాలాలోని విద్యాశాఖకు చెందిన భూమిని పంజాబ్ వక్ఫ్ బోర్డు తమదిగా ప్రకటించింది.
4) తమిళనాడు
* తిరుచెంతురై గ్రామంలో ఒక రైతు తన భూమిని అమ్మలేకపోయాడు, ఎందుకంటే... వక్ఫ్ బోర్డు మొత్తం గ్రామాన్ని తమదిగా ప్రకటించింది. తన కుమార్తె వివాహానికి రుణం తీర్చేందుకు భూమిని అమ్మాలని ప్రయత్నించినా, అమ్మలేకపోయాడు.
5) బీహార్
* గోవింద్‌పూర్ గ్రామం (ఆగస్టు 2024): బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు మొత్తం గ్రామాన్ని వక్ఫ్‌గా ప్రకటించింది. 7 కుటుంబాలు ప్రభావితమై, పట్నా హైకోర్టులో కేసు నడుస్తోంది.
6) కేరళ
* ఎర్నాకులం జిల్లాలో (సెప్టెంబర్ 2024): 600 క్రైస్తవ కుటుంబాలు తమ వంశపారంపర్య భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. వారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఫిర్యాదు చేశారు.
7) కర్ణాటక – 2024 రైతుల ఆందోళనలు
* విజయపురలో వక్ఫ్ బోర్డు 15,000 ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది.
* బళ్లారి, చిత్రదుర్గ, యాదగిరి & ధార్వాడ జిల్లాల్లో కూడా రైతుల ఆందోళనలు జరిగాయి.
* రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చింది – ఎవరినీ బలవంతంగా భూముల నుంచి తొలగించమని హామీ ఇచ్చారు.
8) ఉత్తరప్రదేశ్
* రాష్ట్ర వక్ఫ్ బోర్డుపై అవినీతి & దుర్వినియోగ ఆరోపణలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఉదాహరణలు వక్ఫ్ చట్టంతో సంబంధిత అనేక వివాదాలను & భూసంబంధ సమస్యలను ఉదాహరణలుగా చెప్పొచ్చు.
వక్ఫ్ వ్యవస్థ మతపరమైన, సామాజిక సంక్షేమ & దాతృత్వ కార్యక్రమాలకు మద్దతుగా పనిచేస్తుంది, ముఖ్యంగా పేదలకు సహాయపడుతుంది. కానీ దుర్వినియోగం, ఆక్రమణలు, పారదర్శకత లోపం వల్ల దీని ప్రభావం తగ్గింది. ఈ బిల్లు వల్ల పేదలకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవి:
1) డిజిటల్ సౌకర్యాలు – పారదర్శకత & బాధ్యత పెరుగుదల
* ఒక కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల ట్రాకింగ్, గుర్తింపు, నిర్వహణ & మానిటరింగ్ చేస్తుంది.
* ఆడిటింగ్ & అకౌంటింగ్ వ్యవస్థల ద్వారా ఆర్థిక అవినీతిని అరికట్టే చర్యలు తీసుకుంటారు.
* సముచితంగా నిధులు వినియోగించబడుతున్నాయో లేదో పర్యవేక్షణ పెరుగుతుంది.
2) పేదల కోసం సంక్షేమ & అభివృద్ధి నిధుల పెంపు:
* వక్ఫ్ భూముల అక్రమ వినియోగాన్ని & ఆక్రమణలను అరికట్టి, ఆదాయాన్ని పెంచుతారు.
* ఆదాయం పెరిగితే, పేదల కోసం హెల్త్‌కేర్, విద్య, గృహ నిర్మాణం, జీవనోపాధి సహాయ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తారు.
* నియమిత ఆడిట్లు & తనిఖీలతో ఆర్థిక నియంత్రణ మెరుగవుతుంది, దీని వల్ల వక్ఫ్ పరిపాలనలో ప్రజల నమ్మకం పెరుగుతుంది.
1) ముస్లిమేతర సభ్యుల పాత్ర ఎందుకు అవసరం?
* వక్ఫ్ పరిపాలనలో దాతలు, భూవివాదాల పక్షాలు, లీజుదారులు & కిరాయిదారులు ఉన్నందున, వారికి ప్రాతినిధ్యం కల్పించడం అవసరం.
* వక్ఫ్ సంస్థలు మతపరమైనవే కాదు, సామాజిక, ఆర్థిక & సంక్షేమ రంగాల్లో కూడా పనిచేస్తాయి, అందుకే నియంత్రణ & పారదర్శకత పెంచడానికి ముస్లిమేతర సభ్యులు సహాయపడతారు.
* భారత న్యాయవ్యవస్థ తీర్పుల ప్రకారం, సామాజిక & ఆర్థిక పరిపాలనను కేంద్ర ప్రభుత్వం నియంత్రించే అధికారం ఉంది.
2) సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ (CWC) & రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యుల పాత్ర
* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ (CWC): మొత్తం 22 మంది సభ్యుల్లో 2 మంది ముస్లిమేతరులు ఉండొచ్చు.
* రాష్ట్ర వక్ఫ్ బోర్డులు: 11 మంది సభ్యుల్లో 2 మంది ముస్లిమేతరులు ఉండొచ్చు.
ఈ సభ్యులు ఎలాంటి హక్కులు కలిగి ఉంటారు?
స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోయినా, పాలనా నిపుణతను అందించగలరు.
ఆడిటింగ్, లీజింగ్, డిజిటల్ పరిపాలన వంటి వ్యవస్థల మెరుగుదలలో పాల్గొనగలరు.
మతపరమైన అంశాల్లో తక్కువ ప్రభావం ఉన్నా, వక్ఫ్ నిర్వహణలో పారదర్శకత & సమర్థత పెంచడంలో సహాయపడతారు.