PM Security Lapse: సుప్రీంలో ఇలా విచారణ.. ‘వారు నిరసనకారులతో టీ తాగారు’

By Mahesh KFirst Published Jan 7, 2022, 2:28 PM IST
Highlights

ప్రధాని మోడీకి తన పంజాబ్ పర్యటనలో ఏర్పడ్డ భద్రతా లోపాలపై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కాదని, ఎస్పీజీ యాక్టు పరిధిలోని సమస్య అని, ఇది పార్లమెంటు పరిధిలోకి వస్తుందని పిటిషనర్ వాదించారు. కాగా, ఘటనపై అదే రోజు తాము ద్విసభ్య కమిటీ వేశామని పంజాబ్ ప్రభుత్వం వాదించింది. కేంద్రం కూడా కమిటీ వేసింది. ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం దర్యాప్తు చేయరాదని అటు పిటిషనర్, ఇటు కేంద్రం అభ్యంతరం చెప్పింది.
 

న్యూఢిల్లీ: పంజాబ్(Punjab) పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)కి భద్రతా లోపం(Security Lapse) ఏర్పడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఓ ఎన్జీవో పిటిషన్ దాఖలు చేసింది. సీజేఐ ఎన్వీ రమణ(CJI NV Ramana) సారథ్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుండగా సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. ఈ పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ మనిందర్ సింగ్ వాదిస్తూ.. ఇది అతిపెద్ద భద్రతా లోపం అని,  ఇలా జరిగి ఉండకూడదని అన్నారు. పంజాబ్ పర్యటనలో ప్రధాని కాన్వాయ్‌ను అర్ధంతరంగా ఆపేశారని, ఇది భారీ ఉల్లంఘన అని వాదించారు. ఇది జాతీయ భద్రతా అంశం అని, ఇది పార్లమెంటు పరిధిలోకి వస్తుందని వివరించారు. ప్రధాని భద్రతకు ఎలాంటి లోపం ఏర్పడకూడదని, ఒకవేళ ప్రధాన మంత్రి స్వయంగా భద్రతను కుదించాలని చెప్పినా అంగీకరించవద్దని తెలిపారు. ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కాదని, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టం కిందకు వస్తుందని అన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం విచారింరాదని చెప్పారు. ఈ పిటిషన్ దాఖలైన తర్వాత పంజాబ్ ప్రభుత్వం దర్యాప్తునకు చేసిన కొన్ని ఆదేశాలను పరిశీలించాలని కోరారు.

కేంద్రం తరఫు వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా కూడా ఈ అంశంపై పంజాబ్ ప్రభుత్వం విచారించరాదని అన్నారు. అరుదుల్లోకెల్ల అరుదైన ఈ ఘటనపై విచారించడానికి సుప్రీంకోర్టు సిద్ధం కావడం హర్షనీయం అని తెలిపారు. ఈ ఘటన అంతర్జాతీయంగా దేశానికి అప్రతిష్ట తెచ్చి పెట్టవచ్చని అన్నారు. పీఎం కాన్వాయ్ రోడ్డుపై బయల్దేరుతుండగా ఆ రాష్ట్ర డీజీపీకి సమాచారం చేరవేశారని, ఆయనను సంప్రదించారని తెలిపారు. రోడ్డు మొత్తం క్లియర్‌గా ఉన్నదని, ఎలాంటి ఆటంకాలు లేవని చెప్పిన తర్వాతే ప్రధాని మోడీ కాన్వాయ్ ఆ దారిలో ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. కానీ, రోడ్డు దిగ్బంధనాల ప్రదర్శనలు జరుగుతున్నాయని ఎలాంటి సమాచారాన్నీ డీజీపీ తెలియజేయలేదని వాదించారు. ప్రధాని కాన్వాయ్ ముందు ఓ వార్నింగ్ కారు వెళ్లిందని వివరించారు. అక్కడి స్థానిక పోలీసులు నిరసనకారులతో చాయ్ తాగుతూ కనిపించారని అన్నారు. కానీ, ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డును దిగ్బంధించారనే విషయాన్ని వారు ఆ వార్నింగ్ కారుకు తెలియజేయలేదని పేర్కొన్నారు.

పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీపై యాక్షన్ తీసుకోవాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ బహిరంగ పిలుపు ఇచ్చిందని, ఇది అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రలో భాగంగా జరిగి ఉండవచ్చనీ సొలిసిటర్ జనరల్ వాదించారు. అందుకే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ప్రధాని మోడీకి భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు చేయరాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేకంగా కమిటీ వేయరాదని కోరారు. ఇది కేవలం న్యాయాన్ని తప్పు పట్టే ప్రయత్నంగానూ ఉండవచ్చని అన్నారు. ప్రధాని మోడీ భద్రతా లోపం ఘటనపై దర్యాప్తులో కచ్చితంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉండాలని వాదించారు. దర్యాప్తునకు ఉపకరించడానికి ప్రధాని పర్యటనకు సంబంధించిన ప్రతి రికార్డును భద్రపరచాలని కోరారు.

కాగా, ఆ ఘటన జరిగిన రోజే తాము ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశామని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది అడ్వకేట్ జనరల్ తెలిపారు. రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేశామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని వివరించారు. ఈ పిటిషన్ ఫైల్ కాకముందే తాము కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై తమను తప్పుపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్టు అనుమానిస్తున్నామని, తమ అధికారులు ఎస్పీజీకి సూచనలు చేసినా తమనే తప్పు పట్టేట్టు ఉన్నారని వాదించారు. ఇప్పటికే కేంద్ర కమిటీ తమ అధికారులకు నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు.

దీనిపై ఎస్‌జీ తుషార్ మెహెతా స్పందిస్తూ తాము ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని, ప్రధాని రూట్ ఎలా ప్లాన్ చేశారని, దాని చుట్టూ ఎలాంటి కమ్యూనికేషన్ జరిగింది? ఎవరు ఎవరితో ఏం చెప్పారు? ఇతర పాలనాపరమైన విషయాలనే ఎస్పీజీ ఐజీ కింద ఏర్పాటు చేసిన తమ కమిటీ దర్యాప్తు చేస్తుందని వివరించారు. ఏ కమిటీ అయినా.. కమిషన్ అయినా.. దర్యాప్తు చేస్తే సమస్య ఏమిటని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఏ కమిటీ దర్యాప్తు చేసినా.. ప్రధాని భద్రతలో ఏర్పడ్డ లోపాలు వెలికి రావాలి కదా  అని అన్నారు. కేంద్ర కమిటీలోనూ మార్పులు చేయవచ్చని, అందులో చండీగడ్ డీజీపీ, ఎన్ఐఏ అధికారిని చేర్చవచ్చని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పేర్కొంటూ.. మీరు కమిటీలను లేదా.. మీ అవగాహనలో స్పష్టపరుచుకోవడం కాదు సమస్య.. పిటిషనర్ కోరుతున్న దర్యాప్తు గురించే ఇక్కడ అసలైన విచారణ అని అన్నారు. ఈ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా వేశారు.

click me!