Lok Sabha Elections 2024 : మూడో దశ పోలింగ్ షురూ ... మోదీ, అమిత్ షా ఓటేసారు..

By Arun Kumar PFirst Published May 7, 2024, 7:50 AM IST
Highlights

ఏడు దశల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే రెండుదశల పోలింగ్ ముగిసాయి. ఇవాళ(మంగళవారం) మూడో దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. ఈ దశలో బిజెపి టాప్ లీడర్లు పోటీలో వున్నారు...

దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మరో కీలక ఘట్టానికి ఇవాళ తెరలేచింది. మూడో దశ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమయ్యింది. మొత్తం ఏడు దశల్లో మొత్తం లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మూడో దశలో 11 రాష్ట్రాల్లోని 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలవరకు సాగనుంది. మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోతుండటంతో ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివెళుతున్నారు. ఇక ఎండలు, వడగాల్పుల నుండి ఓటర్లకు ఉపశమనం కలిగించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు వేయడంతో పాటు తాగునీరు, ఓఆర్ఎస్ అందించే ఏర్పాట్లుచేసింది ఈసి. 

ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్ షా లు ఈ దశలోనే ఓటుహక్కును వినియోగించుకోనుండటం. పోలింగ్ ప్రారంభంకాగానే వీరిద్దరు అహ్మదాబాద్ లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.  వీరి సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇప్పటికే సూరత్ ఏకగ్రీవం కాగా మిగతా  25 స్థానాలకు మూడో దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు మన్సుక్ మాండవీయ,  పురుషోత్తమ్ రూపాలా, ప్రహ్లాద్ జోషి, ఎస్పి సింగ్ బఘేల్,  జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. వాళ్లు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

PM Shri casts his vote for General Elections 2024 in Ahmedabad, Gujarat. https://t.co/jZo4huOM8K

— BJP (@BJP4India)

 

ఇక ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈ ఎన్నికల బరిలో నిలిచారు. మధ్య ప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ, దిగ్విజయ్ సింగ్ రాజ్ గఢ్ నుండి పోటీచేస్తుంటే కర్ణాటక మాజీ సీఎం బసవరాజు బొమ్మై హవేరీ బరిలో నిలిచారు. ఈ లోక్ సభ స్థానాల్లోనూ ఈ దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ దశలో గుజరాత్ లోని 25 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తర ప్రదేశ్ లో 10, మధ్యప్రదేశ్ లో 9, చత్తీస్ ఘడ్ లో 7, బిహార్ లో 5, పశ్చిమ బెంగాల్ లో 4, అస్సాంలో 4, గోవాలు 2, డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలి లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.  మొత్తంగా ఈ దశలోో 17.24 కోట్లమంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.


 

click me!