కర్ణాటక ఆక్రమిత మహా ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉద్ధవ్ ఠాక్రే

By Mahesh KFirst Published Dec 26, 2022, 5:10 PM IST
Highlights

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర ప్రాంతాలను యూటీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో ఈ అంశం తేలేవరకూ యూటీగానే ఉంచాలని అన్నారు.
 

ముంబయి: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర శాసన మండలిలో సరిహద్దు వివాదమై ప్రశ్నలు సంధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న కొన్ని గ్రామాలు మావంటే మావని ఈ రెండు రాష్ట్రాలు వాదించుకుంటున్నాయి. కర్ణాటక సరిహద్దులోపల ఉన్న మరాఠీ మాట్లాడే గ్రామాలు తమవే అని మహారాష్ట్ర పేర్కొంటున్నది. ఈ వివాదమై ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇది కేవలం భాష, సరిహద్దు వివాదం మాత్రమే కాదు.. ఇది ఒక మానవీయమైన సమస్య అని వివరించారు. మరాఠీ మాట్లాడుతున్న ప్రజలు కొన్ని తరాలుగా సరిహద్దుకు ఆవల జీవిస్తున్నారని, వారి నిత్య జీవితం, భాష, జీవన శైలి మొత్తం మరాఠీనే అని అన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నన్ని రోజులు ఈ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని నిలదీశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నదని, కాబట్టి, యథాతథ స్థితిని కొనసాగించాల్సిందే.. కానీ, ఇక్కడ వాతావరణాన్ని చెడగొడుతున్నదెవరూ? అంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీనే కర్ణాటకలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: అంగుళం భూమిని కూడా వ‌దులుకోం.. క‌ర్నాట‌క-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు వివాదంపై దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కీల‌క వ్యాఖ్యలు

సరిహద్దు వివాదం ఎప్పుడో సెటిల్ అయిందని, అందులో నుంచి ఒక్క అంగుళం కూడా పొరుగు రాష్ట్రానికి ఇచ్చేది లేదని కర్ణాటక శాసనసభ పునరుద్ఘాటించింది.

రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తినప్పుడు పెద్దన్నపాత్ర వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని అడిగారు. కేంద్ర ప్రభుత్వం గార్డియన్‌గా వ్యవహరించాలని కోరారు.

భాషా ప్రాతిపదికన 1957లో పునర్వ్యవస్థీకరించినప్పటి సమస్య ఇప్పటికీ కొనసాగుతున్నది. బొంబాయ్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు దాని పరిధిలోని గ్రామాలు కొన్ని ఇప్పుడు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. సుమారు 800 మరాఠీ మాట్లాడే గ్రామాలు ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నాయని మహారాష్ట్ర వాదిస్తున్నది.

click me!