ఇండియా ఫేమస్ మసాల బ్రాండ్ ‘ఎవరెస్ట్, ఎండీహెచ్’లకు ఎదురుదెబ్బ.. పొరుగు దేశంలో బ్యాన్.. ఎందుకంటే? 

By Rajesh Karampoori  |  First Published May 17, 2024, 1:58 PM IST

ఇండియాలో ఫేమస్ మాసాల బ్రాండ్లకు విదేశాల్లో పెద్ద కష్టం వచ్చింది. పొరుగు దేశాల్లో ఎవరెస్ట్, ఎండీహెచ్ ల మసాల ఉత్పత్తులను నిషేధించాయి. దానికి కారణం ఏంటంటే ? 


మన దేశంలో ఎంతో ఫేమస్ మసాల బ్రాండ్ అయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ లకు కు పెద్ద కష్టం వచ్చింది. ఆ మసాల బ్రాండ్ ను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇథిలిన్ ఆక్సైడ్ స్థాయిలను పరీక్షించగా.. భారతీయ మసాలా బ్రాండ్లు అయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ బ్రాండ్ ల దిగుమతి, వినియోగం, అమ్మకాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. 

ఈ రెండు మసాలా దినుసుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నాయని పరీక్షల్లో తేలాయి. దీంతో ఆ రెండింటిని అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ మసాల దినుసుల్లో హానికరమైన రసాయనాల ఆనవాళ్లు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో వారం రోజుల క్రితమే దిగుమతిపై నిషేధం విధించామని, మార్కెట్లో అమ్మకాలను కూడా నిషేధించామని నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహర్జన్ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.

Latest Videos

‘‘ఈ రెండు బ్రాండ్ల మసాలా దినుసుల్లోని రసాయనాలపై పరీక్షలు జరుగుతున్నాయి. తుది నివేదిక వచ్చే వరకు నిషేధం అమల్లో ఉంటుంది. హాంకాంగ్, సింగపూర్ ఇప్పటికే దీన్ని నిషేధించాయి.’’ అని ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాల్లో ఈటీవో వాడకాన్ని 0.73 శాతం నుంచి 7 శాతం వరకు అనుమతించినట్లు భారత ప్రభుత్వ వర్గాలు ‘ఏఎన్ఐ’కి తెలిపాయి.

ఇదిలా ఉండగా, ప్రభావిత ప్రాంతాలకు భారతీయ సుగంధ ద్రవ్యాల ఎగుమతుల భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా చర్యలు ప్రారంభించింది. టెక్నో-సైంటిఫిక్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేస్తూ, బోర్డు సమగ్ర మూలకారణ విశ్లేషణను నిర్వహించింది. ప్రాసెసింగ్ సౌకర్యాలను పరిశీలించింది. గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో పరీక్ష కోసం నమూనాలను సేకరించింది. 

ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్పోర్టర్స్ ఫోరం, ఇండియన్ స్పైస్ అండ్ ఫుడ్స్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ సహా 130కి పైగా ఎగుమతిదారులు, సంఘాలతో స్పైస్ బోర్డు వాటాదారుల సంప్రదింపులను నిర్వహించింది. అదనంగా భారతదేశం నుండి ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాలలో ఈటీవో కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో బోర్డు ఎగుమతిదారులందరికీ ఈటీవో ట్రీట్ మెంట్ కోసం మార్గదర్శకాలను జారీ చేసింది.

click me!