భారత్ లో రాలిపోతున్న చిన్నారులు

First Published Aug 6, 2018, 12:31 PM IST
Highlights

ఏటా సుమారు 11 లక్షల మంది చిన్నారులు భారత్‌లో కన్నుమూస్తున్నారు. చిన్నారుల మరణాల విషయంలో భారత్ ఇప్పటికీ ప్రపంచంలో తొలి వరుసలోనే ఉంది.

భారతదేశంలో శిశు మరణాల తీరు ఆందోళన కలిగిస్తున్నది. దేశంలోని సగానికిపైగా జిల్లాలు నవజాత శిశువులతోపాటు ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలను తగ్గించడంలో ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 2030 నాటికి శిశుమరణాల్ని సగానికిపైగా తగ్గించాలని నిర్దేశించుకున్న లక్ష్యం  నీరు గారి పోతున్నదని ఆస్ట్రేలియాలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలిసిస్‌ పరిశోధకులు  జయంత్ బోరా, నందిత సైకియా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. నవజాత శిశువులు, ఐదేళ్ల లోపు చిన్నారుల అకాల మరణాలపై 2015-16లో కేంద్రం చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాలను ప్రామాణికంగా భారత్‌లో జిల్లాల వారీగా సమాచారం సేకరించి, విశ్లేషించారు. 

శిశు, చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట వేయడంలో భారత్ విఫలం
భారతదేశంలో శిశు, ఐదేళ్ల చిన్నారుల మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నా, వాటికి అడ్డుకట్ట వేయడంలో భారత్ విఫలమైంది.  ఏటా సుమారు 11 లక్షల మంది చిన్నారులు భారత్‌లో కన్నుమూస్తున్నారు. చిన్నారుల మరణాల విషయంలో భారత్ ఇప్పటికీ ప్రపంచంలో తొలి వరుసలోనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2030 నాటికి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-3 (ఎస్‌డీజీ-3) ప్రకారం అన్ని దేశాలు నవజాత శిశుమరణాల్ని ప్రతి 1000 జననాలకు 12కు, అలాగే ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాలను ప్రతి 1000 జననాలకు 25కు తగ్గించాలని నిర్దేశించారు. కానీ, భారత్‌లో ఆ దిశగా పూర్తిగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

2013 నాటికి ప్రతి వెయ్యిమందికి 50 మంది చిన్నారుల మరణం
గత 23 ఏళ్లలో భారత్‌లో ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలు సగానికిపైగా తగ్గాయి. 1990లో ప్రతి 1000 జననాలకు 109 మంది చిన్నారులు కన్నుమూయగా, 2013 నాటికి వీరి సంఖ్య సుమారు 50కి తగ్గింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశిత లక్ష్యానికి కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ఇక నవజాత శిశు మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ప్రతి 1000 జననాలకు 29 మంది శిశువులు మరణిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశిత లక్ష్యం కంటే ఇది 2.4 రెట్లు ఎక్కువ. శిశు మరణాల్లో ఒడిశా రాష్ట్రం అత్యంత ప్రమాదకర స్థానంలో ఉంది. ఇక్కడి రాయగడ జిల్లాలో ఏకంగా ప్రతి 1000 జననాలకు 141.7 మంది కన్నుమూస్తుండడం విషాదకరం. కాకపోతే నైరుతి ఢిల్లీలో పరిస్థితి ఒకింత మెరుగ్గా ఉంది. ఇక్కడ ప్రతి 1000 జననాలకు కేవలం 6.3 మంది మాత్రమే మరణిస్తున్నారు.

అట్టడుగున ఉత్తర - మధ్య భారత రాష్ట్రాలు
చిన్నారుల మరణాలను తగ్గించడంలో ఒడిశా, ఉత్తర-మధ్య భారతం, తూర్పు రాష్ర్టాలు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. శిశు మరణాలను తగ్గించడంలో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అత్యంత దారుణంగా వెనుకబడి ఉన్నాయి. ఉత్తర భారతంలో లింగ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. అసమానతలు, అవిద్య, అభివృద్ధిలేమి, నిరక్షరాస్యత, ఆరోగ్య సదుపాయాల లేమి తదితరాలు శిశు మరణాలకు కారణం. యూపీలో ఒక్క జిల్లా కూడా లక్ష్య సాధన దిశగా కనుచూపు మేరలోనూ ఒక్క జిల్లా కూడా లేదు. అయితే, డబ్ల్యూహెచ్‌వో లక్ష్యాల సాధనలో మరింత సమిష్టి కృషి, అంకితభావంతో పనిచేస్తే గమ్యాన్ని సాధించవచ్చు అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.

14 జిల్లాల్లోనే డబ్ల్యూహెచ్ఓ లక్ష్యాల సాధనపై పురోగతి
వచ్చే 12 ఏళ్లలో ‘ఐదేళ్లలోపు బాలల మరణాలను అరికట్టే విషయమై నిర్దేశిత లక్ష్యాల సాధనలో భారతదేశంలోని 14 శాతం జిల్లాల్లో మాత్రమే పురోగతి నెలకొంది. ఇది నవజాత శిశువుల విషయంలో కేవలం తొమ్మిది శాతమే. ప్రగతి సాధించిన గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చిన్నారుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాకపోతే 1990వ దశకంతో పోలిస్తే 2010 తర్వాత శిశు మరణాల కట్టడి విషయమై గణనీయమైన పురోగతి మొదలైంది. 2005 - 2016 మధ్య వివిధ జిల్లాల్లో శిశు మరణాల్లో క్షీణత నమోదైంది. 

ఫిలిప్ఫీన్స్ తల్లుల అమ్మతనం ఇలా..
మనీలా: శిశు మరణాల నివారణకుకు ఫిలిప్పీన్స్ తల్లులు మరో ముందడుగు వేశారు. శిశు మరణాలకు పౌష్టికాహార లోపమే కారణమని, వీటికి విరుగుడు తల్లి పాలు అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. మనీలా స్టేడియంలో ఆదివారం 1,500 మంది మాతృమూర్తులు ఒకే చోట చేరి తమ చిన్నారులకు స్తన్యమిచ్చారు. చిన్నారులకు పాలివ్వడం నామోషీగా భావించొద్దని, తల్లి పాలకు మించిన అమృతం లేదని పేర్కొంటూ అమ్మతనం గొప్పదనాన్ని చాటారు. ఈ వారాంతంలోగా పలు నగరాల్లో ఇటువంటి కార్యక్రమాలే చేపడతామని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తెలిపింది.

click me!