ఆడవాళ్లు కట్టిన కోటలివి.. చూస్తే కళ్లు చెదరాల్సిందే..!

First Published Mar 7, 2024, 12:12 PM IST

International Womens Day 2024 : భారత దేశ చరిత్రలో మహిళల పాత్ర ఎన్నటికీ మరువలేనిది. ఇంటిని, కుటుంబాన్ని చూసుకుంటేనే.. వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. ఆడవాళ్లు వంటింటికే పరిమితం అయ్యే రోజులు ఎప్పుడో పోయాయి. దీనికి నిదర్శనమే.. వాళ్లు కట్టిన కొన్ని అందమైన కోటలు. 
 

మన భారతదేశ సంస్కృతి, సౌభాగ్యాన్ని చూడాలంటే ఇక్కడున్న చారిత్రక కట్టడాలను ఖచ్చితంగా చూడాల్సిందే.  వీటి అందాన్ని చూస్తే ఈ జన్మకు ఇంతకన్నా చూడాల్సిందేమీ లేదు అనిపిస్తుంది. ఏదేమైనా మన దేశంలోని చారిత్రక వారసత్వమంతా పురుష పాలకులచే నిర్మించబడిందని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే మన దేశంలో పితృస్వామ్యమే రాజ్యమేలింది. వారు చెప్పిందే జరిగింది. పితృస్వామ్య మూలాలు అప్పట్లో చాలా లోతుకు పాతుకుపోయాయి. దీనివల్లే ఆడవాళ్లను తక్కువ అంచనా వేస్తారు. వీళ్లకు ఏదీ రాదని చులకన చేస్తారు. కానీ మహిళలపై ఉన్న వివక్షను రూపుమాపడానికి, సమాజంలో వారికి సమాన హోదా కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

రాణి లక్ష్మీ బాయి, రజియా సుల్తాన్ ల కాలంలో మన దేశ చరిత్రలో మహిళల పాత్ర గురించి తెలుసుకోవాలంటే.. వారు నిర్మించిన చారిత్రక కట్టడాల గురించి మనమందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలో ఆడవాళ్లు నిర్మించిన కొన్ని చారిత్రక భవనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

Rani ki vav

రాణి కీ వావ్ - గుజరాత్

గుజరాత్ లోని పటాన్ జిల్లాలో ఉన్న రాణీ కీ వావ్ లేదా స్టెప్ వెల్ ను పదకొండో శతాబ్దంలో రాణి ఉదయమతి నిర్మించారు. ఈమె తన భర్త రాజు భీమ్ దేవ్-1 జ్ఞాపకార్థం ఈ వావ్ ను నిర్మించింది. ఈ కోటను ఏడు అంతస్తులు నిర్మించారు. ఈ వావ్ తలకిందులైన ఆలయం ఆకారంలో ఉంటుంది. ఈ వావ్ సరస్వతీ నది ఒడ్డున నిర్మించించబడి ఉంది. ఈ వావ్ ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లో చేర్చారు.

రాణీ కీ వావ్ లో 800కు పైగా శిల్పాలు, స్తంభాలు ఉన్నాయి. ఈ వావ్ తయారీకి మారు గుజరాత్ ఆర్కిటెక్చర్ ను ఉపయోగించారు. ఈ వావ్ లో విష్ణుమూర్తి ఎన్నో అవతారాల శిల్పాలు ఉన్నాయి. అలాగే ఎందరో దేవతలు, అప్సరసుల విగ్రహాలను కూడా ఈ కోటలో చూడొచ్చు. సరస్వతీ నదిలో వచ్చిన వరదల కారణంగా ఈ వావ్ మొత్తం భూమిలో మునిగిపోయింది. దీనిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుక్కొంది. ఇప్పటి వరకు కూడా ఇది మంచి కండిషన్ లో ఉంది. దీని అందాలను చూసేందుకు దేశవిదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. అయితే భద్రతా కారణాల వల్ల ఇప్పుడు ఈ వావ్ లోకి 4-5 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉంది
 

Humayun's Tomb, Delhi

హుమాయూన్ సమాధి - ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో  హుమాయూన్ సమాది ఉంది. ఈ సమాధి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి హుమాయూన్  ది. 1556 లో చక్రవర్తి హుమాయూన్ మరణించిన తరువాత అతని బేగం హమీదా బాను ఈ సమాధిని నిర్మించింది. ఇది 1569 సంవత్సరంలో పూర్తయింది. ఈ సమాధిని పర్షియన్ వాస్తుశిల్ప నిపుణుడు మిరాక్ మీర్జా ఘియాస్ దీనిని రూపొందించాడు. 1993లో దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కేటగిరీలో చేర్చింది.
 

విరూపాక్ష ఆలయం - కర్ణాటక

విరూపాక్ష ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో ఉంది. ఈ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించారు. దీనిని 14 వ శతాబ్దంలో రాణి లోకమహాదేవి నిర్మించారు. ద్రావిడ శైలిని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఎంత అందంగా ఉందో దాని గోడలపై చెక్కిన శిల్పాలే చెప్తాయి. వీటిని మాటల్లో వర్ణించడం కష్టమే. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కూడా చేర్చబడింది.

కొన్ని పౌరాణిక కథలు కూడా ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్తాయి. ఇది హంపి రామాయణంలోని కిష్కింద అని నమ్ముతారు. ఇది కాకుండా రావణుడు శివుడిని మోసుకెళ్తున్న కథ కూడా ఈ ఆలయానికి సంబంధించినదని చెప్తారు. ఈ కథకు సంబంధించిన చిత్రాలను ఈ ఆలయ గోడపై కూడా మనం చూడొచ్చు.
 

mirjan fort

మీర్జా కోట - కర్ణాటక

మీర్జా కోట కర్ణాటకలో ఉంది. ఈ కోటను 16 వ శతాబ్దంలో రాణి చెన్నభైరదేవి నిర్మించారు. ఆమెను పెప్పర్ క్వీన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఆమె 54 సంవత్సరాల పాటు పరిపాలించింది. అలాగే భారతదేశాన్ని అత్యధిక కాలం పాలించిన మహిళా పాలకురాలు కూడా ఈమే. ఈ కోట నిర్మాణ విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ కోట చరిత్రలో ఎన్నో యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచింది.


ఈ కోటను నిర్మించడానికి లేటరైట్ రాళ్లను ఉపయోగించారు. ఈ కోట డబుల్ వాల్స్ , ఎత్తైన గోడలు, గోపురాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ కోట గోడపై నాచు ఉంది. అందుకే ఈ కోట మొత్తం ఆకుపచ్చగా కనిపిస్తుంది. చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. 
 

ఇత్మాద్-ఉద్-దౌలా సమాధి - ఆగ్రా

ఈ సమాధిని బేగం నూర్జహాన్ తన తండ్రి మీర్జా ఘయాస్ బేగ్ కోసం నిర్మించింది. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఉంది. సమాధి నిర్మాణం 1622 లో ప్రారంభమై 1628 లో పూర్తయింది. దీనిని శృంగర్దన్ లేదా బచ్చా తాజ్ అని కూడా పిలుస్తారు. ఇది ఎంతో అందంగా ఉండటం వల్ల  భారతదేశంలో ఉన్న చారిత్రక ప్రదేశాలలో దీనికి కూడా ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ సమాధి తెల్లని పాలరాతితో తయారు చేయబడింది. అలాగే దీనిపై రాళ్లతో అందంగా డెకరేట్ చేశారు. దీనిని పర్షియన్ వాస్తుశిల్పం శైలిలో నిర్మించారు. 

click me!