మీరు నవ్వుతున్నప్పుడు మూత్రం బయటకు వస్తే తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఇది సమస్యకు ఆరంభం మాత్రమే కావొచ్చు. నిజానికి నవ్వినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూత్రం బయటకు వచ్చే సమస్య ప్రస్తుతం మహిళల్లో సర్వసాధారణంగా మారుతోంది. ఇది వారిని ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఈ మూత్ర సంబంధిత వ్యాధిని మూత్రం ఆపుకొనలేని పరిస్థితి (యుఐ) అంటారు. ఈ వ్యాధి పురుషులకు కూడా వస్తుంది. కానీ మహిళలకే ఎక్కువగా వస్తుంది. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి యూరిన్ లీకేజీ సమస్యలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ వ్యాధికి గల కారణాలేంటి? దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వృద్ధాప్య మహిళల్లో యూఐ సమస్య సర్వసాధారణంగా మారుతుంది. 30-35 ఏండ్ల తర్వాత మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి గల కారణాలేంటంటే?
కటి కండరాలు బలహీనపడటం
రుతువిరతికి ముందు లేదా కొన్నిసార్లు వయస్సు పెరగడం వల్ల మహిళల పొత్తికడుపు దిగువ కండరాలు అంటే కటి కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల మూత్రం లీక్ సమస్య ప్రారంభమవుతుంది.
దీర్ఘకాలిక అనారోగ్యం
కొంతమంది మహిళల్లో దీర్ఘకాలిక అనారోగ్యం, సరైన ఆహారం లేకపోవడం లేదా శారీరక బలహీనత కూడా మూత్రం లీక్ అయ్యేందుకు కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో.. కటి కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు.. నవ్వేటప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఏదైనా శ్రమ కార్యకలాపాలు చేసేటప్పుడు మూత్రాశయంపై ఒత్తిడి పడుతుంది. దీంతో మూత్రం లీక్ అవుతుంది.
డెలివరీ
ప్రసవం తర్వాత కూడా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికి కారణం బిడ్డకు జన్మనివ్వడంలో కింది కండరాలు ఎక్కువగా సాగదీయబడతాయి. ఇది వారిపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే వారిని బలహీనపరుస్తుంది.
ఊబకాయం, మధుమేహం
మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం, మధుమేహం కూడా యూరిన్ లీకేజీకి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ సమస్య మీకు చాలా కాలంగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.
జీవనశైలిని మెరుగ్గా ఉంచుకోవాలి.
తీపి, పుల్లని వస్తువుల వినియోగాన్ని తగ్గించాలి లేదా మొత్తమే ఆపాలి.
కాఫీ, టీ, ధూమపానానికి దూరంగా ఉండాలి.
కండరాలను బలోపేతం చేయడానికి, కటి ఫ్లోర్ కండరాల వ్యాయామాలు చేయాలి.
మూత్రాశయ శిక్షణ తీసుకోండి. ఈ శిక్షణలో మూత్రాశయం క్రమంగా మూత్రాన్ని ఆపడానికి శిక్షణ పొందుతుంది. దీనితో మీరు వేగంగా వచ్చే మూత్రాన్ని ఎదుర్కోవడం నేర్చుకుంటారు.
అవసరమైతే మందులు వాడండి.
శస్త్రచికిత్స అవసరమైతే భయపడకండి.