Vegetable Price : ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి... దేని ధర చూసినా కిలో రూ.50 కి అటుఇటుగా ఉంది. గతనెల డిసెంబర్ లో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన ధరలు కొత్త సంవత్సరంలో కొండెక్కి కూర్చున్నాయి. వంద రూపాయల నోటు పట్టుకుని మార్కెట్ కు వెళితే పట్టుమని రెండు రకాల కూరగాయలు కూడా రావడంలేదు... మరి వారానికి సరిపడా కావాలంటే రూ.300 నుండి రూ.500 సమర్పించుకోవాల్సిందే.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయల దిగుబడి బాగా తగ్గింది... అందుకే ధరలు అమాంతం పెరిగాయని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. అటు రైతులకు దిగుబడిలేక లాభాలు లేవు... ఇటు సామాన్యులను ధరలు బెంబేలెత్తిస్తున్నారు.. మధ్యలో వ్యాపారులు మాత్రమే లాభపడుతున్నారు. మార్కెట్ లోకి కూరగాయల సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు... దీంతో కొత్త సంవత్సరంలో సామాన్యులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి.
సాధారణంగా ప్రతి వీకెండ్ హైదరాబాద్ , విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ వంటి నగరాల్లో కూరగాయల సంతలు జరుగుతుంటాయి. ఉద్యోగులు, గృహిణులు ఇక్కడే వారానికి సరిపడా కూరగాయలు కొంటుంటారు. మరీ ఈ వీకెండ్ మార్కెట్స్ లో వెజిటెబుల్స్ ధరలు ఎలా ఉండనున్నాయో ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల సరైన ధరకు కూరగాయలు కొనే వీలుంటుంది... తద్వారా కొంత డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.