తెలంగాణ జనజీవితాన్ని చిత్రకళలో శాశ్వతం చేసిన ప్రముఖ చిత్రకారుల్లో కాపు రాజయ్య గారు ముఖ్యులని మనందరికీ తెలుసు. వారు బోనాలు, బతుకమ్మ చిత్రాలు వేశారని తెలుసుగానీ ఎర్రబస్సు కోసం వేచి చూస్తున్నప్రయాణీకుల బొమ్మను కూడా చిత్రించారని తెలుసుకోవడం నేటి సందర్భానికి తగిన విషయం.
undefined
సహజమూ సుందరమూ అయిన తెలంగాణ జన జీవితాన్ని చిత్రకళలో అత్యంత ఆత్మీయంగా ఆవిష్కరించిన చిత్రకారుల్లో కాపు రాజయ్య గారు ప్రముఖులని అందరికీ తెలిసిందే. జీవితాన్ని సన్నిహితంగా పరిశీలించి వేసిన వారి చిత్రాలు నిజానికి సామాన్యమైన బతుకు చిత్రాలే. కానీ కాలక్రమంలో అవి తెలంగాణ ఆత్మను పట్టించేవి కావడం, ముందుకు నడిచే క్రమంలో ఆయా చిత్రాలు మన సామూహిక సంబురంలో భాగం కావడం ఒక అందమైన అంశం. అలాగే, వారి కొన్ని చిత్రాలు వర్తమానంలో ఆధునిక జీవన ఘడియలను కూడా అలవోకగా వ్యక్తం చేయడం కవితా న్యాయం కిందే భావించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం బోనాలు, బతుకమ్మలను అధికారిక పండుగలుగా ప్రకటించిందని మనకు తెలుసు. కానీ, కాపు రాజయ్య గారు ఆ పండుగలను ఎప్పుడో తన కాన్వాసుపై తీరొక్క రంగులతో చిత్రించి తెలంగాణ జన జీవితానికి పట్టాభిషేకం చేశారు.
undefined
తెలంగాణ సంస్కృతి పట్ల, ఇక్కడి పండుగలు పబ్బాల పట్ల వారికున్న అభిమానం ఒక వ్యక్తిగానే కాకుండా కళాకారుడిగా కూడా సమున్నతమైనది. అంతే కాదు, వారి ముందు చూపు, ఆర్తి, శ్రామికులపట్ల అనురక్తి ఎంత గొప్పదో చెప్పడానికి పని పాటల్లో నిమగ్నమైన వివిధ వృత్తి దారుల చిత్రాలే మంచి ఉదాహరణలు. అట్లే, కష్టానికి వెరువని జీవితాల పట్ల వారి సహానుభూతికి నిండు నిదర్శనం కల్లుగీత కార్మికులపై వేసిన ‘రిస్కీ లైఫ్’ చిత్రం.
undefined
గమ్మత్తేమిటంటే, జానపద చిత్రకారుడిగా గుర్తింపు పొందిన కాపు రాజయ్య గారు ఆధునిక జీవితాన్ని కూడా అత్యంత వాస్తవికంగా చిత్రించడం. ఆయన పల్లెల్లోకి వచ్చిన బస్సు సౌకర్యం గురించి చెప్పడానికి, అది జీవితంలో ఒక భాగం అయిందని తెలుపడానికి వారు చిత్రించిన ‘వేచి చూపు’ అన్న బొమ్మ ఒక గొప్ప ఉదాహరణ. ఈ బొమ్మ మన పల్లె వెలుగును అపూర్వ వర్ణ వైభవంతో ఆవిష్కరిస్తుంది. ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ఈ బొమ్మ నిజానికి అపురూప చిహ్నం.
undefined
విచిత్రం ఏమిటంటే, దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే రాజయ్య గారు ఈ చిత్రాన్ని వేయడం. వారు బతుకమ్మ వంటి జన జీవితంలో భాగమైన సాంస్కృతిక చిహ్నాలనే కాదు, ఎర్రబస్సు కోసం వేచి ఇలాంటి చూసే ఒక అనివార్య జీవన ఛాయను, ఆధునిక సోకర్యాల సోయిని చిత్రించి పదిలం చేయడం నిజంగా విశేషమే.Waiting (వేచి చూపు) పేరిట రాజయ్య గారు వేసిన ఈ చిత్రంలో గ్రామీణ జీవితం నిదానంగా ఆధునికతను సంతరించుకోవడాన్ని ఎంత అద్భుతంగా చిత్రిస్తారో ప్రయాణీకుల వెంట ‘ముల్లె’తో పాటు ‘సూట్ కేస్’ వచ్చి చేరదాన్ని అంతే అలవోకగా గీశారు. అంతేకాదు, ముగ్గురు మహిళల్లో ఒక మహిళ కళ్ళద్దాలు ధరించడాన్ని కూడా వారు చిత్రించడం గమనించవచ్చు. “ఈ చిత్రాన్ని నాన్న గారు 1961లో చిత్రించారు, వీక్షకులు సిద్దిపెటలోని కళాభవన్ లో దీన్ని ఎపుడైనా సందర్శించవచ్చు.” అని రాజయ్య గారు కుమారులు డాక్టర్ రమేష్ చెప్పారు.
undefined
“ఆర్టీసీ వారు ఈ చిత్రాన్ని చూసి, ఆ తర్వాతి కాలంలో నాన్న గారితో అదే బొమ్మను మరోసారి ప్రత్యేకంగా గీయించుకున్నారు. అందులో బోర్డు, వివిధ రాజకీయ పక్షాల సింబల్స్ కూడా వేయడం చూడవచ్చు” అని రమేష్ గారు వివరించారు. అ చిత్రంలో ప్రయాణీకుల వెంట మొదటి బొమ్మలో మిస్సయిన కుక్కను కూడా రాజయ్యగారు జత చేయడం ఒక ఆసక్తికరం.అన్నట్టు, నేడు గొల్లభామ చీరలకు ఫేమస్ అవుతున్న సిద్ధిపేట రాజయ్య గారి స్వస్థలం. ఇక్కడి గొల్లభామ చీరలపై కనిపించే కోలాటం వంటి బొమ్మలను కూడా రాజయ్యగారు ఎపుడో గీశారు. అలాగే, వసంత కేళిని కవితాత్మకంగా వారు చిత్రించారు. అంతేకాదు, రాజయ్య గారు వేసిన రాధాకృష్ణుల చిత్రం ఎంతో సుప్రసిద్ధమో కళాభిమానులకు తెలుసు. ఇవి కాకుండా ‘పొలం పనులు’ మొదలు సోది చెప్పే మహిళ, ‘పాలమ్మో పాలు’ అంటూ వీధుల్లోకి వెళ్ళే గొల్లభామల చిత్రాలూ రాజయ్య గారు వేశారు.ఒకటని కాదు, వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి లాంటి వందలాది జనజీవన చిత్రాలతో కాపు రాజయ్య గారు తెలంగాణ బహుజన జీవితానికి పెద్ద పీట వేయడం అందరికీ తెలిసిందే. బహుశా, తెలంగాణకు సంబంధించి జీవితాన్ని ఇంత సన్నిహితంగా చిత్రించిన కళాకారులు మరొకరు లేరని అంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు. ఏమైనా, ఈ బొమ్మ సాక్షిగా రాజయ్య గారి చిత్రం కాలాతీతం. అది సామాన్య జీవితం సాఫీగా సాగడంలో ఆర్టీసి పాత్రను చెబుతూనే, ‘వేచి చూడటం’ అన్న భారం ఒకటున్నదని, దాని తాలూకు అనివార్య విసుగు ఎలాంటిదో ప్రయాణీకుల బాడీ లాంగ్వేజ్ ద్వారా రాజయ్య గారు వ్యక్తం చేయడాన్ని గమనించవచ్చు. అప్పటి బొమ్మను మనం ఇప్పుడు చూస్తూ ఉంటే, ‘ప్రస్తుత సమ్మె విరమణ ఎప్పుడు’ అన్న భావన కలగడమూ సహజం. బహుశా అదే వేచి చూపు అసలు ‘రిలవెన్స్.’
undefined