ఈ టిప్స్ పాటిస్తే మీ చెక్ బౌన్స్ కాదు.. లేకుంటే జైలు శిక్ష, జరిమానా తప్పదు

First Published | Nov 19, 2024, 2:29 PM IST

చెక్ బౌన్స్ అయితే ఫైన్ వేస్తారని తెలుసు కదా.. అని నిర్లక్ష్యంగా ఉంటే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అసలు చెక్కులు బౌన్స్ ఎందుకు అవుతాయి? కారణాలు ఏమిటి? అవ్వకుండా ఏం చేయాలి? ఒక వేళ చెక్ బౌన్స్ అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. జైలు శిక్ష పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

ఇప్పుడంతా ఆన్‌లైన్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి. చాలా మంది UPI, నెట్ బ్యాంకింగ్‌ని ఉపయోగిస్తున్నారు. మనీ ట్రాన్సాక్షన్ కి  సులభమైన మార్గంగా ఆన్‌లైన్ ఉపయోగపడుతోంది. కానీ నేటికీ పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయాలంటే ప్రజలు చెక్కులనే ఉపయోగిస్తున్నారు. అయితే చెక్ ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే వెంటనే ఇలా చేయండి. లేకుంటే మీరు జైలుకు వెళ్లాల్సి రావచ్చు.

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ విస్తృతంగా జరుగుతున్నప్పటికీ చెక్కులు ఇప్పటికీ ముఖ్యమైన, నమ్మదగిన పేమెంట్ మెథడ్స్ లో ఒకటి. వ్యాపారులు, వ్యక్తులు అధికారిక డాక్యుమెంటేషన్ కోసం చెక్స్ ఉపయోగిస్తారు. అయితే చెక్ లో వివరాలు ఫిల్ చేసే సమయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే తప్పులున్నా, లేదా నిర్లక్ష్యంగా రాసినా చెక్ బౌన్స్ అవడానికి దారి తీస్తుంది.

బ్యాంకింగ్ పరంగా బౌన్స్ అయిన చెక్కును అవమానకరమైన చెక్కు అంటారు. చట్టం 1881 సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌన్స్ చేయడం నేరం. నేరం రుజువైతే జారీ చేసిన వ్యక్తికి జరిమానా లేదా జైలు శిక్ష పడుతుంది. అయితే చెక్ ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు చాలా సార్లు చెక్ బౌన్స్ అవుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. 


సాధారణంగా చెక్ బౌన్స్ అయితే జరిమానా విధిస్తారు. లేదా ఒకటి, రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఒక్కోసారి రెండూ విధిస్తారు. చెక్ బౌన్స్ కావడానికి సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి.

చెక్ ఇష్యూ చేసిన వ్యక్తి అకౌంట్ లో తగినంత డబ్బు లేకపోవడం

చెక్కుపై సంతకం సరిపోలకపోవడం వల్ల కూడా చెక్ బౌన్స్ అవుతుంది.

చెక్ లో వివరాలు ఫిల్ చేసేటప్పడు తప్పులు రాయడం, లేదా అకౌంట్ డీటైల్స్ తప్పుగా ఇవ్వడం కూడా చెక్ బౌన్స్ కి కారణాలు. 

చెక్ ఇష్యూ తేదీల్లో మార్పులు, గడువు ముగిసిన చెక్కులు ఇవ్వడం కూడా ఓ కారణమే. 

చెక్ బౌన్స్ అయిన వెంటనే చట్టపరమైన చర్యలు ప్రారంభం కావు. బ్యాంక్ సాధారణంగా జారీ చేసిన వ్యక్తికి సమస్యను తెలియజేస్తూ నోటీసు ఇస్తుంది. లోపాన్ని సరిదిద్దడానికి వారికి అవకాశం ఇస్తుంది. మూడు నెలల లోపు మరో చెక్ ఇవ్వడానికి ఆ వ్యక్తికి అవకాశం ఉంటుంది. 

అలా ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయితే చెక్ తీసుకున్న వ్యక్తికి చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. ప్రతి చెక్ బౌన్స్‌కూ బ్యాంకులు జరిమానా విధిస్తాయి. ఈ మొత్తాన్ని చెక్ ఇష్యూ చేసిన వ్యక్తి భరించాల్సి ఉంటుంది. జరిమానా ఛార్జీలు బ్యాంక్, బౌన్స్ కారణాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

సాధారణంగా రూ.150 నుండి రూ.800 వరకు ఉంటుంది. అంతేకాకుండా బౌన్స్ అయిన చెక్కుకు కారణాన్ని వివరిస్తూ బ్యాంక్ చెక్ ఇష్యూ చేసిన వ్యక్తికి మెమోను జారీ చేస్తుంది. ఈ నోటీసుకు 15 రోజుల్లోపు ప్రతిస్పందించాలి. లేకపోతే చెక్ తీసుకున్న వ్యక్తి మెజిస్ట్రేట్ కోర్టులో కంప్లయింట్ చేయవచ్చు.

ఒక వేళ నేరం రుజువైతే జారీ చేసిన వ్యక్తి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది.

అందుకే చెక్కును ఇష్యూ చేసే ముందు మీ అకౌంట్ లో తగినంత డబ్బు ఉందో లేదో చెక్ చేసుకోండి. టోటల్ అమౌంట్, తేదీ, సంతకం, అకౌంట్ డీటైల్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ఎక్స్‌పైరీ  కాని చెక్కులనే ఇస్తున్నారని నిర్ధారించుకోండి. ఒక వేళ చెక్ బౌన్స్ అయితే వెంటనే సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీరు జైలు శిక్ష పడకుండా జాగ్రత్త పడవచ్చు. 

Latest Videos

click me!