Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?

By Venugopal Bollampalli - EditorFirst Published Feb 13, 2024, 3:21 PM IST
Highlights

సాధారణంగా బలమైన ప్రతి పక్షం ఉన్నపుడు ప్రభుత్వం చేసే ప్రతి చిన్న తప్పునూ, నిర్లక్ష్యాన్నీ చాలా బలంగా, పెద్ద వైఫల్యంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. దీని వల్ల అధికార ప్రభుత్వానికి  ఎక్కువగానే బలహీనతలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్నదీ అదే.

సరిగ్గా మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఈ పాటికే రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి.. ప్రచార హీట్. సోషల్ మీడియాలో పార్టీల మధ్య వార్, చర్చలు, వాదనలు, వాగ్వాదాలు.. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? అంటూ జాతీయ స్థాయి నుంచి స్థానిక మీడియా సర్వే సంస్థల దాకా ఎవరికి అంచనాలు వారివి. మరి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? తెలుసుకోవాలంటే.. మనం ముందుగా పార్టీల ప్రోస్.. అండ్ కాన్స్.. స్థానిక ప్రజల ఆలోచనా తీరును చూడాలి.

కాసేపు మనం పార్టమెంట్ ఎన్నికలను పక్కన పెట్టేద్దాం. పక్కా లోకల్.. అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. ఆంధప్రదేశ్ లో ప్రధానంగా ఈ సారి ఎన్నికలు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు మధ్యే. తర్వాతి సీఎం అయ్యేది కూడా దాదాపు ఈ ఇద్దరిలో ఒకరే.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నుంచి షర్మిల, బీజేపీలో పురంధేశ్వరి ఉన్నా వీరికి ముఖ్యమంత్రి అవకాశాలు అత్యల్పం . కాస్తో కూస్తో ఏమైనా అవకాశం ఉంది అంటే ఒక్క పవన్ కల్యాణ్కు ఉండొచ్చు. కాకుంటే.. ఈ ముగ్గురి ప్రభావం ఈ ఎన్నికల్లో తెలుగు దేశం, వైసీపీ గెలుపోటములు మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక ఆయా పార్టీల బలాలు, బలహీనతల విషయానికి వస్తే..

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చూద్దాం

బలాలు

  • అధికారంలో ఉండటం
  • వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు
  • సంక్షేమ పథకాలు
  • నవరత్నాలు
  • అణగారిన వర్గాల సపోర్ట్

బలహీనతలు

  • అప్పులు
  • అభివృద్ధి లేకపోవడం పరిశ్రమలు రాకపోవడం
  • మూడు రాజధానులు
  • చంద్రబాబును అరెస్టు
  • అవినీతి అరోపణలు
  • ఎమ్మెల్యేల మార్పు
  • సజ్జల, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితోనే నడవడం

సాధారణంగా బలమైన ప్రతి పక్షం ఉన్నపుడు ప్రభుత్వం చేసే ప్రతి చిన్న తప్పునూ, నిర్లక్ష్యాన్నీ చాలా బలంగా, పెద్ద వైఫల్యంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. దీని వల్ల అధికార ప్రభుత్వానికి  ఎక్కువగానే బలహీనతలు కనిపిస్తుంటాయి.

ఇప్పుడు టీడీపీ గురించి చూద్దాం

బలాలు

  • చంద్రబాబు అరెస్ట్, సింపతీ పెరగడం, కేడర్ పునరుత్తేజితం అవడం
  • లోకేశ్ ఇతర కుటుంబ సభ్యుల పాదయాత్రలు
  • జనసేన మద్ధతు, బీజేపీతోనూ స్నేహం
  • కొన్ని ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ కుటుంబంలో చీలిక
  • అమరావతి ఉద్యమం, జగన్ అభివృద్ధి పెద్దగా కనిపించకపోవడం
  • కొందరు నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు

బలహీనతలు

  • చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు
  • ఇఫ్పటికీ కొన్ని చోట్ల బలమైన నాయకులు లేకపోవడం
  • స్థానిక నాయకత్వాన్ని ఎదగనివ్వకపోవడం
  • ఇంకా టికెట్లు ప్రకటించకపోవడం
  • ఇంకా ఖరారు కాని పొత్తులు.. సీట్లు

 

జనసేన విషయానికి వస్తే

బలాలు

  • టీడీపీతో పొత్తు
  • బీజేపీతో స్నేహపూర్వకంగా ఉండటం
  • పార్టీని మరింత బలోపేతం చేయడం
  • కొన్ని వర్గాల ఓటు బ్యాంకు

బలహీనతలు

  • ఇంకా బలమైన కేడర్ లేకపోవడం
  • స్థానిక నాయకతర్వలేమి
  • తక్కువ ఓటు బ్యాంకు

 

ఇక కాంగ్రెస్, బీజేపీల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి షర్మిల నాయకత్వంతో కాస్త ఊపు వచ్చిందనే చెప్పాలి. కాకపోతే.. దీని వల్ల షర్మిలకు లేదా కాంగ్రెస్ కు జరిగే మేలుకన్నా జగన్ కు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక పురంధ్వేశ్వరి రాష్ట్ర బీజేపీని లీడ్ చేయడం వల్ల అటు టీడీపీకి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఒకవేళ టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరితే.. చంద్రబాబు కొన్ని మైనారిటీ ఓట్లు కోల్పోవచ్చు.

వైసీపీ, టీడీపీ అలయన్స్ గెలుపోటలముల అవకాశాలు 

జగన్ ప్రకటించిన మూడు రాజధానుల వల్ల కేవలం అమరావతిలోనే వ్యతిరేకత ఉంది.. మిగతా చోట్ల అంతా స్వాగతిస్తున్నారన్నది వైసీపీ మాట. ఈ పాటికే కర్నూలు.. వైజాగ్ లలో ఆయా రాజధానులు ఏర్పాటు చేసి ఉంటే వైసీపీ మాట నిజమయ్యేదే. కానీ ఇప్పటికే సీఎం చాలా సార్లు వైజాగ్ కు షిఫ్ట్ అవుతున్నామని ప్రకటించినా.. ఇంకా అది సాధ్యం కాలేదు. దీంతో ఈ మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు ఎలా పరిగణిస్తారన్నదాన్ని మనం సులభంగా  అర్థం చేసుకోవచ్చు. అలాగే అభివృద్ధి కూడా.. రాజధానులు, పోలవరం, పరిశ్రమలు, ఇతర రంగాల్లో అభివృద్ధికన్నా అప్పులు.. నాసిరకం లిక్కర్ షాపులే ప్రధానంగా విశ్లేషకులు, సోషల్ మీడియా చర్చల్లో కనిపిస్తున్నాయి.

ఇక నవరత్నాలు.. అంటారా వైసీపీ గెలుస్తుంది అని చెప్పడానికి ఉన్న బలమైన కారణం.. నవరత్నాలు.. అంటే రైతు భరోసా, అమ్మ ఒడి, నేతన్న నేస్తం తదితరాలు. ఈ సంక్షేమ ఫథకాల వల్ల అణగారిన వర్గాల్లో సానుకూలత ఉంది. కాకుంటే ఈ సంక్షేమ పథకాలే జగన్ కు అధికారం కట్టబెడతాయా అనేది కాలం.. ఓటరు నిర్ణయించాల్సిన అంశం.

ఇక టీడీపీ విషయానికి వస్తే.. మోరల్ గా చాలా ఊపు మీద ఉన్న పార్టీ ఇది. చంద్రబాబును అరెస్ట్ చేయడం.. దీంతో పవన్ కల్యాణ్ వెంటనే ఆ పార్టీతో పొత్తు ప్రకటించడం.. రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూడటం ఇలాంటి పరిణామాలతో తెలుగు దేశం గతంతో పోల్చితే కాస్త బలంగా కనిపిస్తోంది. కాకుంటే ఇంకా తేలని సీట్ల సర్దుబాటు.. పోత్తుల చర్చలు పార్టీ కేడర్ కి కాస్త గందరగోళ పరిస్థితిని కల్పిస్తున్నాయి.

ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉన్నది అనేది చంద్రబాబు గెలుపు ఓటములను నిర్ణయించనుంది. టీడీపీ ఇప్పుడు కాస్త బలంగా కనిపిస్తున్నా.. వైసీపీ వ్యతిరేకత వీరికి ఎంత వరకు మేలు చేస్తుందనేది మరో  నెలల్లో తేలిపోనుంది. కాకుంటే ఆ మధ్య నాయకులు టీడీపీ సింగిల్ గా పోటీ చేయాలంటూ విసిరిన సవాళ్లు ఎక్కడో వైసీపీలో కాస్త ఆందోళనను తెలియజేస్తున్నాయి.

ఇదే మిశ్రమ పరిస్థితి ఇటీవల విడుదలైన పలు సర్వే ఫలితాల్లోనూ కనిపించింది.

టైమ్స్ నౌ మ్యాట్రిజ్ సర్వే  ఏపీలో ఈ సారి వైసీపీదే అధికారమని చెబుతోంది.  ఎంపీ సీట్ల వరకే ఈ సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 సీట్లకు వైఎస్ఆర్సీపీ 19 చోట్ల విజయం సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. విపక్ష జనసేన, టీడీపీ కూటమికి ఆరు ఎంపీ స్థానాలు రావొచ్చని చెప్పింది.

మూడ్ ఆఫ్ ద ఏపీ పేరుతో పాపులర్ ప్రీ పోల్ సర్వే ఏం చెప్పిందంటే.. ఏపీలో పరిస్థితి చాలా హోరాహోరీగా ఉందని.. చంద్రబాబు.. జగన్ లలో ఎవరికైనా అధికారం దక్కవచ్చని అంటోంది.

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25 లోక్‌సభ స్థానాల్లో 1 0 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ-జనసేనకి 9 స్థానాలు గెల్చుకోవచ్చు అని చెప్పింది. ఇక మిగిలిన 6 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని వెల్లడించింది. తిరుపతి, విజయవాడ, నంద్యాల, విజయనగరం, ఏలూరు, కడప, అరకు, అమలాపురం, రాజంపేట, చిత్తూరు, లోక్‌సభ స్థానాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందని ఇక శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, నరసరావుపేట, బాపట్ల, నరసాపురం, కాకినాడ, కర్నూలు, హిందూపురం పార్లమెంట్ స్థానాల్ని తెలుగుదేశం-జనసేన గెల్చుకోగలవని ఈ సర్వే పేర్కొంది. ఇక రాజమండ్రి, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. 

‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఏపీ ఎన్నికలపై సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం వైసీపీకి కేవలం 35 నుంచి 40 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. ఇక టీడీపీ-జనసేన కూటమికి 95 నుంచి 100 వరకూ వస్తాయని.. అధికారం కూటమిదేనని సర్వే సంస్థ తేల్చింది. ఇక వైసీపీకి 45%, టీడీపీ-జనసేన కూటమికి 52%, ఇతరులు 3 శాతం ఓట్ షేర్‌ ఉంటుందని పయనీర్ పేర్కొంది. 

ఇక ఇండియా టుడే (India Today) మూడ్ ఆఫ్ నేషన్’ పేరిట సర్వే చేయించింది. తెలుగుదేశం : 17, వైఎస్సార్సీపీ : 08 లోక్ సభ స్థానలు గెలుచుకుంటాయని పేర్కొంది. టీడీపీకి 45 శాతం, వైసీపీకి 41.1 శాతం, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్కి 2.7 శాతం ఓట్ షేర్ ఉంటుందని చెప్పింది.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారీ ఎవరి గెలుపైనా అంత ఈజీగా ఉండకపోవచ్చు.

click me!