Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి.
తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, కామారెడ్డి వంటి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షాలు తీవ్రంగా కురిసి ప్రమాదాలు సంభవించాయి. ఆదివారం కురిసిన వర్షాలకు నాలాలు పొంగిపొర్లడంతో నలుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
25
యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రైతుల కోసం కొత్త నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపారు. తగ్గించిన ప్రతి కట్టకు రూ.800 నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు.
కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అధిక యూరియా వాడకం ఆరోగ్యానికి హానికరమని, ముఖ్యంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించారు. పంట దిగుబడి పెరుగుతుందని భావించి యూరియాను అధికంగా వాడటం తప్పని అన్నారు. ఇకపై అవసరమైనంత మేరకే వాడాలని, ప్రత్యామ్నాయంగా మైక్రో న్యూట్రియంట్స్ అందించాలన్నారు.
35
వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ చట్ట సవరణ 2025పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. సోమవారం జారీ చేసిన మధ్యంతర ఆదేశాల ప్రకారం, మొత్తం చట్టాన్ని రద్దు చేసే అవసరం లేదని చెప్పినా, కొన్ని నిబంధనలు మౌలిక హక్కులకు విరుద్ధమయ్యే అవకాశముందని గుర్తించి వాటి అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.
కోర్టు నిలిపివేసిన సెక్షన్లలో, సెక్షన్ 3(r) ప్రకారం వక్ఫ్‌కు ఆస్తి దానం చేయాలంటే ఐదేళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలనే షరతును తొలగించింది. సెక్షన్ 2(r) కింద నియమిత అధికారి నివేదిక లేకుండా ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించడం సబబు కాదని పేర్కొంది. సెక్షన్ 3C ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడానికి కలెక్టర్‌కు ఇచ్చిన అధికారాన్ని కూడా స్టే చేసింది.
అయితే, వక్ఫ్ బోర్డులో ముస్లిం కాని సభ్యుల పరిమితి, బోర్డు ఎక్స్-ఆఫీసియో సభ్యులు తప్పనిసరిగా ముస్లింలే కావాలన్న నిబంధనలు అమలులోనే ఉంటాయి. చట్టాన్ని పూర్తిగా నిలిపివేయడం అరుదైన విషయమని, తుది తీర్పు వచ్చే వరకు వక్ఫ్ ఆస్తులపై హక్కులు ప్రభావితం కాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన వైఖరిని మార్చుకున్నారు. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్‌లో అక్రమంగా పనిచేస్తున్న కార్మికులను నిర్బంధించిన ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా యూఎస్‌లో పెట్టుబడులను తగ్గించే సంకేతాలు ఇచ్చింది.
దీనిపై స్పందించిన ట్రంప్, అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమని, వారు కొంతకాలం తమ సిబ్బందిని తీసుకురావచ్చని తెలిపారు. అమెరికా కార్మికులు వారినుంచి శిక్షణ పొందాలని, అలా చేస్తే పెట్టుబడులు మరింత ప్రయోజనకరంగా మారుతాయని పేర్కొన్నారు.
55
ఆసియా కప్‌లో యూఏఈ తొలి విజయం
అబుదాబిలో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో యూఏఈ 42 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. ముందుగా యూఏఈ 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ వసీమ్ (69), అలీషన్ షరాఫ్ (51) హాఫ్ సెంచరీలు బాదారు.
జోహైబ్ 21, హర్షిత్ కౌశిక్ 19 పరుగులు చేశారు. లక్ష్యఛేదనలో ఒమన్ 18.4 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. జునైద్ సిద్ధిక్ 4 వికెట్లు తీశాడు. వసీమ్ 1,947 బంతుల్లోనే 3,000 టీ20 పరుగులు పూర్తి చేసి జోస్ బట్లర్ రికార్డును అధిగమించాడు.